డబ్బులిస్తావా.. కిడ్నాప్ చేయమంటావా?
వార్డెన్‌ను బెదిరించిన ఓ మహిళ
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై
కోవూరు : ‘మూడు లక్షలు ఇవ్వు.. లేకుంటే హాస్టల్ విద్యార్థులకు జరిగే నష్టానికి నీదే బాధ్యత’ అని తనను ఫోన్ ద్వారా ఓ మహిళ వేధిస్తోందని నెల్లూరు జిల్లా కోవూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ వార్డెన్ టి.మహేశ్వరి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు.. చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి లీలావతి అనే మహిళ వివిధ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ చేస్తోంది. నీకు నీ భర్తకు మధ్య సమస్యలు ఉన్న విషయం మాకు తెలుసు అని మాట్లాడుతోంది. అడిగిన నగదు ఇవ్వకపోతే నీ భర్త శంకర్ చేత విద్యార్థులను కిడ్నాప్ చేయిస్తానని, అనంతరం ఉద్యోగం పోవడం ఖాయమని మానసికంగా వేధిస్తోంది. ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారులుకు సైతం ఫిర్యాదు చేశాను. నా జీతాభత్యాల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ఆ మహిళ సేకరించింది.
ఆమె వల్ల వసతి గృహ విద్యార్థులకు హాని జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయడం, దర్యాప్తు చేయడం తదితరాలపై నిరాకరించారని బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు చేసినట్లు రశీదు ఇవ్వమన్నా ఎస్సై సుధాకర్‌రెడ్డి ఇవ్వనన్నారని వాపోయింది. ఆరు రోజులే కదా పాఠశాలలు ఉండేది, ఈ లోపు ఏం చేస్తారు? అని ఎస్సై నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, ఈలోపు విద్యార్థులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని వార్డెన్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై జిల్లా ఎస్పీను కలవనున్నామని తెలిపింది. దీనిపై ఎస్సై సుధాకర్‌రెడ్డిని సంప్రదించగా వార్డెన్ స్టేషన్‌కు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. సమస్యను తనతో చెప్పారని, ఫిర్యాదు రాసివ్వమని అడగ్గా మళ్లీ వస్తామని వెళ్లిపోయారని తెలిపారు