మంతనాలు
* స్టాలిన్‌తో వాసన్ సమాలోచన
* వేదికగా పెళ్లి వేడుక
సాక్షి, చెన్నై : డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్(టీఎంకే) నేతల కుటుంబాల మధ్య జరిగిన శుభకార్యం రాజకీయ చర్చకు వేదికగా మారింది. ఈ వేడుకలో డీఎంకే దళపతి ఎంకే.స్టాలిన్, టీఎంకే నేత జీకే వాసన్లు నలభై నిమిషాలు పక్కపక్కనే కూర్చుని సమాలోచనలో మునగడం గమనార్హం. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు డీఎంకే వర్గాలతో జీకే.వాసన్ స్నేహ పూర్వకంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ను వీడినానంతరం టీఎంకేకు పునర్జీవం పోసిన వాసన్ డీఎంకే వర్గాల్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే వైపు వెళ్లేందుకు ప్రయత్నించి, చివరకు ప్రజా సంక్షేమ కూటమిలో సర్దుకున్నారు. ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన వాసన్ స్థానిక ఎన్నికల్లో పొత్తు అడుగులు జాగ్రత్తగా వేస్తామని స్పందించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం మధురైలో జరిగిన వివాహ వేడుకలో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో మరీ సన్నిహితంగా మెలుగుతూ రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు.
మధురైలో డీఎంకే మాజీ మంత్రి తంగం తెన్నరసు, టీఎంకే నేత, మాజీ ఎంపీ సిత్తన్ కుటుంబం మధ్య కుదిరిన వియ్యంతో వివాహ వేడుక జరిగింది. ఇందుకు డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. అందరి కన్నా ముందుగానే అక్కడకు చేరుకున్న వాసన్ స్టాలిన్‌ను ఆహ్వానంగా పలకరించారు. వీరిద్దరూ ఏదో అంశం గురించి చర్చించుకున్నంతగా నలభై నిమిషాలపాటు మంతనాల్లో మునిగారు. అయితే, వీరి సమాలోచన ఏ అంశంపై సాగిందో అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీంట్లో ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయని చెప్పవచ్చు.