waste decomputer
-
‘బయో’ భయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వీర్యం ఘోరంగా ఉంది. ఈ వ్యర్థాల నిర్వీర్యం సరిగా లేకపోవడంతో హెపటైటిస్ బి లాంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రుల్లో విడుదలయ్యే వ్యర్థాలను ఎక్కడికక్కడ వేరుచేసి, నిబంధనల మేరకు నిర్దేశించిన ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సి ఉండగా అలా చేయకుండా వ్యర్థాలను పారపోస్తున్నారు. ప్లాస్టిక్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విజయవాడ అరండల్‌పేటలో బయోవ్యర్థాల వాస్తవ స్థితిగతులు ‘సాక్షి’ పరిశీలనలో బయటపడ్డాయి. ఒక పడక వ్యర్థానికి రూ.4 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో పడక నుంచి విడుదలయ్యే వ్యర్థాలకు రోజుకు రూ.4 ఇస్తారు. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 250 గ్రాముల వరకు వ్యర్థాలు విడుదలవుతున్నాయి. రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో సగటున 8 వేల పడకలు ఉండగా, గుంటూరు, కృష్ణా, విశాఖలో మాత్రం ఒక్కో జిల్లాలోనే 20 వేల పడకలున్నాయి. రాష్ట్రం మొత్తం సుమారు 1.40 లక్షల పడకల నుంచి రోజుకు 35 వేల కిలోల బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే నిర్వీర్యం చేయాలి. కానీ అలా చేయడం లేదు. ఉదాహరణకు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకే కాంట్రాక్టర్ ఈ నిర్వహణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా యూనిట్‌ను గత కొన్ని నెలలుగా నిర్వహించకుండా ఈ వ్యర్థాలను గుంటూరుకు తరలిస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. అంతేకాకుండా వ్యర్థాల రవాణా, వాటి నిర్వీర్యం విషయంలో ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. బయో వ్యర్థాలను నిర్వీర్యం చేసే యూనిట్లలో పనిచేసే సిబ్బందికి కనీస రక్షణ ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యర్థాల నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా, వైరస్ల వల్ల తాము వ్యాధులబారిన పడుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు బయో వ్యర్థాల నిర్వీర్యంలో పీసీబీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కవుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏసీబీకి దొరికిన అధికారే దీనికి నిదర్శనం. ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లు ఎలా ఉన్నా, ప్లాస్టిక్ వ్యర్థాలను బయటే అమ్ముకుంటున్నా, వీటిని రవాణా చేసే విషయంలో ఎలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్ ఉంటున్నారు. కొత్త వారిని రానివ్వడం లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకుంటే 25 కేసులు పెట్టారు. చివరకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు గెలిచి కాంట్రాక్ట్ దక్కించుకోగలిగారు. పీసీబీ అధికారులే వెనకుండి కొత్త కాంట్రాక్టర్‌ను ఇబ్బందిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని ఓ పీసీబీ అధికారికి వివరణ కోసం ఫోన్ చేయగా.. వెంటనే సంబంధిత యూనిట్ల వారికి సమాచారం అందడం గమనార్హం. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఇవే.. ♦ బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్ ఉండాలి. ♦ ఈ వాహనాలకు రూట్ చార్ట్ ఉండాలి. ♦ ఏ ఆస్పత్రిలో ఎంత బయోవ్యర్థాలు సేకరించారో కాంట్రాక్ట్ సంస్థ విధిగా తన వెబ్సైట్లో నమోదు చేయాలి. ♦ వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. ♦ వారికి గ్లౌజులు, ఎన్–95 మాస్కులు ఉండేలా చూడాలి. ♦ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి. ♦ సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి బయో వ్యర్థాల నిర్వహణ ఎలా ఉంటుందంటే.. ♦ ప్రతి జిల్లాలో టెండర్ల ద్వారా పీసీబీ ఆధ్వర్యంలో సంస్థను నిర్ణయిస్తారు. ♦ జిల్లాకొక కాంట్రాక్టర్‌ను నిర్ణయిస్తారు. అదే జిల్లాలో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. ♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యర్థాలన్నీ ఏ రోజుకారోజు సేకరించాలి. ♦ ఆస్పత్రిలోనే వ్యర్థాలను వేర్వేరు బ్యాగుల్లో వేసి సంచిని సీల్ చేసి బార్కోడ్ వేస్తారు. ♦ ఆ వ్యర్థాల సంచులను నిర్వీర్యం చేసే ప్లాంట్ వరకూ తెరవకుండా తీసుకెళ్లాలి. వ్యర్థాల నిర్వహణ ఎలా ఉండాలి? ఆస్పత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాల్లో నాలుగు రకాలు ఉంటాయి. వీటిని వేర్వేరు బ్యాగుల్లో వేస్తారు. పసుపు పచ్చ బ్యాగులో టాక్సిన్ వేస్ట్ (విషపూరిత వ్యర్థాలు లేదా అవయవాలు), ఎర్రబ్యాగుల్లో సిరంజిలు, గ్లౌజ్ వంటి ప్లాస్టిక్‌వి, తెల్ల బ్యాగుల్లో నీడిల్స్, కత్తులు, నల్లబ్యాగుల్లో ఆహార వ్యర్థాలు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఎర్రబ్యాగుల్లో వేసిన ప్లాస్టిక్‌ను వెయ్యి సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కరిగించి, ముక్కలు చేయాలి. దీనికి కేజీకి రూ.10 ఇస్తారు. ఆసుపత్రుల్లో ఏం జరుగుతోంది దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను బ్యాగుల్లో నుంచి తీసి నేరుగా చెత్త సేకరించేవారికి కేజీ రూ.60కు అమ్మేస్తున్నారు. వారు ఈ వ్యర్థాలను స్వల్ప ఉష్ణోగ్రతలో కరిగించి స్ట్రాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఐస్‌క్రీమ్ కప్పులుగా తయారుచేస్తున్నారు. నష్టాలేంటి దీనివల్ల హెపటైటిస్ బి, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది. చర్యలు శూన్యం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయో వ్యర్థాల వల్ల జబ్బులొస్తున్నాయని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులూ చర్యలు తీసుకోవడంలేదు. విజయవాడ అరండల్‌పేటలో ‘సాక్షి’ పరిశీలనకు వెళ్లగా బ్యాగులు తీసేసి అప్పటికప్పుడే ఇతర ప్రాంతానికి తరలించారు. మరమ్మతులున్నాయని అనుమతించాం కృష్ణా జిల్లాలో ఉన్న ప్లాంటు మరమ్మతుకు వచ్చిందంటే 15 రోజులు గుంటూరులోని ప్లాంటులో వ్యర్థాలను నిర్వీర్యం చేస్తామంటే అనుమతి ఇచ్చాం. – కె.వి.రావు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, పీసీబీ, విజయవాడ అక్కడ పరిస్థితులు దారుణం నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వీర్యం జరగడం లేదు. కొన్ని రోజుల కిందటే ఈ ప్లాంట్‌ను చూసి కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చాం. బయో వ్యర్థాలు ఓపెన్ చేసి ఎక్కువ సేపు ఉంచడం వల్ల వాసనలు వస్తున్నాయి. – మహేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, పీసీబీ, గుంటూరు బయో వ్యర్థాల వల్ల పెను ప్రమాదం బయో వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయకపోతే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే. హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సి, ఎ వంటి వ్యాధులు వస్తాయి. ఆస్పత్రిలో వాడిన కత్తులు, నీడిల్స్, సర్జికల్ బ్లేడ్స్ కారణంగా టైఫాయిడ్, కలరా, ఇన్ఫెక్షన్లు, రుమటిక్ ఫీవర్, చర్మసంబంధిత వ్యాధులు వస్తాయి. రక్తం వంటివి ఉన్న బ్యాగులు లేదా, గ్లౌజులు సరిగా నిర్వీర్యం చేయకపోతే ఫైలేరియాసిస్, మలేరియా లాంటి వ్యాధులూ వస్తాయి. – డా.హరిచరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల. -
వేస్ట్ డీకంపోజర్’ ద్రావణం ఒక్కటి చాలు!
‘వేస్ట్ డీకంపోజర్’ ఆవిష్కర్త, ఎన్.సి.ఒ.ఎఫ్. డైరెక్టర్ డా. క్రిషన్ చంద్రతో ‘సాగుబడి’ ముఖాముఖి ‘సాక్షి సాగుబడి’ పేజీ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ‘వేస్ట్ డీకంపోజర్’ ద్రావణం గురించి తెలుసుకున్న వేలాది మంది రైతులు దీన్ని సంపూర్ణ సేంద్రియ ఎరువుగా, పురుగుల మందుగా అన్ని రకాల పంటలపై వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారని ‘వేస్ట్ డీకంపోజర్’ ఆవిష్కర్త, ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్)లోని ఎన్.సి.ఒ.ఎఫ్. డైరెక్టర్ డా. క్రిషన్ చంద్ర వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ‘సాగుబడి’ ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలంగాణలోనే కనీసం 10 వేల మంది రైతులు వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని వాడుతున్నారని, తాము ఏ సమావేశానికి వెళ్లినా దీని ద్వారా పొందుతున్న సత్ఫలితాల గురించి రైతులు సంతోషంగా చెబుతున్నారని అన్నారు. అందువల్లనే డీకంపోజర్ సీసాలను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇది సేంద్రియ రైతులకు మాత్రమే కాకుండా రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు కూడా ఉపయోగమేనంటూ.. దీన్ని ఉపయోగిస్తే రసాయనిక ఎరువుల వాడకాన్ని ఈ పంట కాలంలోనే 70 శాతం వరకు తగ్గించుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ 85 వేల మంది రైతుల ద్వారా వేస్ట్ డీకంపోజర్ ద్రావణంతో సేంద్రియ కూరగాయల సాగుకు ఉపక్రమిస్తున్నదని, ఇందుకు తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిది.. రైతులు కంపెనీల వద్ద కొనుగోలు చేయకుండా తమంతట తామే పొలంలో తయారు చేసుకొని వాడుకోదగిన ఇటువంటి బహుళ ప్రయోజనకారి అయిన ద్రావణం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. ప్రతిసారీ కంపెనీల నుంచి కొని వాడుకునే జీవన ఎరువు/పురుగుమందులే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేంద్రియ రైతులు పంటల సాగు క్రమంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం వెతకడమే లక్ష్యంగా.. 11 ఏళ్ల పాటు ప్రయోగాలు చేసి తాను ఈ డీకంపోజర్ ద్రావణాన్ని కనుగొన్నానన్నారు. రైతు రూ. 20తో కొంటే.. జీవితాంతం వాడుకోవచ్చన్నారు. ప్రతి 100 లీటర్ల నీటిలో కిలో బెల్లంతోపాటు ఒక డీకంపోజర్ బాటిల్లోని పొడిని కలుపుకోవాలని.. రోజుకోసారి కలియదిప్పుతూ ఉంటే 4 లేదా 5 రోజులకు ద్రావణం లేత గోధుమ రంగులోకి మారుతుందని, అప్పుడు వాడకానికి సిద్ధమైనట్టేనని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. రసాయనిక ఎరువులు అతిగా వాడిన భూముల్లో ఎకరానికి నీటి తడి ఇచ్చిన ప్రతిసారీ 400 లీటర్ల ద్రావణాన్ని సాగునీటిలో కలిపి పారించాలని, 6 నెలల తర్వాత నుంచి 200 లీటర్లు వాడితే సరిపోతుందన్నారు. మోతాదు ఎక్కువైనా నష్టమేమీ ఉండదన్నారు. 6 నెలలకు సేంద్రియ కర్బనం, సూక్ష్మపోషకాలు, ఈసీ విలువ, ఉదజని విలువ సానుకూలంగా మారతాయన్నారు. నెమటోడ్స్‌ను అరికడుతుంది.. 3 దఫాలు సాగునీటితోపాటు ఈ ద్రావణాన్ని ఇస్తే పంటల్లో నెమటోడ్స్ (నులిపురుగుల) సమస్యను అధిగమించవచ్చని డా. క్రిషన్ చంద్ర చెప్పారు. అంతేకాదు మట్టి ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా వచ్చే ఎటువంటి తెగుళ్లనైనా ఇది అరికడుతుందన్నారు. ఏ పంట మీదైనా 10 రోజులకోసారి పిచికారీ చేయాలన్నారు. 20 రోజులలోపు పంట అయితే 3 లీటర్ల ద్రావణాన్ని 7 లీటర్ల నీటిలో కలిపి చల్లాలని.. తర్వాతయితే ఈ ద్రావణాన్ని నీరు కలపకుండానే నేరుగా పిచికారీ చేయాలన్నారు. గుంటూరు, మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర జిల్లాల్లో రైతులు పత్తిలో వాడుతున్నారని, మిర్చిలో వైరస్ సమస్యను అధిగమించారని తెలిపారు. బయోగ్యాస్ తయారీలోనూ ఈ ద్రావణాన్ని వాడొచ్చన్నారు. బయోగ్యాస్ స్లర్రీపై దీన్ని చల్లితే 15 రోజుల్లో చక్కని ఎరువు తయారవుతుందన్నారు. వర్మీ కంపోస్టు బెడ్స్‌లో 70 శాతం తేమ ఉండేలా దీన్ని చల్లితే కేవలం 21 రోజుల్లో చక్కని వర్మీకంపోస్టు సిద్ధమవుతుందన్నారు. ప్రాంతీయ మండళ్ల ద్వారా సేంద్రియ సర్టిఫికేషన్.. సేంద్రియ రైతులకు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం(పీజీఎస్) ద్వారా సేంద్రియ వ్యవసాయ ధృవీకరణ ఇవ్వడంతోపాటు.. సేంద్రియ వ్యవసాయోత్పత్తుల కొనుగోలుదారులతో రైతులను అనుసంధానం చేయడానికి దేశవ్యాప్తంగా కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన 600 ప్రాంతీయ మండళ్లు పనిచేస్తున్నాయని డా. క్రిషన్ చంద్ర వివరించారు. ఇందులో 45 ప్రైవేటు ఏజెన్సీలన్నారు. ఒక ఏజెన్సీ హైదరాబాద్‌లో రైతు సేవా కేంద్రాన్ని తెరిచిందని, అక్కడ వేస్ట్ డీకంపోజర్ సీసాలను కూడా రైతులు కొనుగోలు చేయొచ్చన్నారు. పీజీఎస్ గుర్తింపు పొందిన సేంద్రియ రైతులు తమ సొంత గ్రామం, జిల్లా, రాష్ట్ర సంబంధిత ప్రత్యేక బ్రాండ్ల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చన్నారు. పీజీఎస్ గుర్తింపు పొందిన రైతులు దేశంలో 2.5 లక్షల మంది ఉన్నారని, 30–40 శాతం వరకు అధికాదాయం పొందుతున్నారన్నారు. ప్రపంచ సేంద్రియ మహాసభ న్యూఢిల్లీలో నవంబర్‌లో తొలిసారి జరుగనుందని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. 111 దేశాల నుంచి సేంద్రియ రైతులు హాజరవుతున్నారని, భారతీయ సేంద్రియ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. బీటీ పత్తి పంట వ్యర్థాలను కుళ్లబెట్టినప్పుడు అందులోని విషం ఎంతవరకు తగ్గుతున్నదనే అంశాన్ని పరిశీలించలేదన్నారు. ఇంటిపంటలకు, దోమల నిర్మూలనకూ వేస్ట్ డీకంపోజర్ ఉపయోగకరమే..! గుర్గావ్ వంటి చోట్ల ‘వేస్ట్ డీకంపోజర్’ ద్రావణాన్ని సేంద్రియ ఇంటిపంటల సాగులో విజయవంతంగా వాడుతున్నారని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. ఈ ద్రావణం ఇంటి పట్టున వాడుకోవడానికి సురక్షితమైనదని తెలిపారు. చిన్న బక్కెట్లోకి కొంత వరకు ఈ ద్రావణం తీసుకొని.. అందులో రోజువారీ వంటింటి వ్యర్థాలను వేస్తూ ఉంటే.. 30 రోజుల్లో చక్కని పోషక ద్రావణం తయారవుతుందన్నారు. దీనికి నీరు కలపకుండా నేరుగా సేంద్రియ ఇంటిపంటలకు, మొక్కలకు ద్రవరూప ఎరువుగా, పురుగుమందుగా వాడొచ్చన్నారు. మురుగుకాలువల దుర్వాసనను ఈ ద్రావణం చల్లిన గంటలో పోగొడుతుందన్నారు. దోమలను, ఈగలను సైతం పారదోలుతుందన్నారు. మరుగుదొడ్డి సెప్టిక్ ట్యాంక్‌లో 5 లీటర్ల ద్రావణం పోస్తే ట్యాంకులో వ్యర్థాలు కుళ్లిపోతాయని, గ్యాస్ వల్ల ట్యాంకుకు పగుళ్లు రాకుండా ఉంటాయన్నారు. ఏడాది పాటు పీజీఎస్ సేవలు ఉచితం! హైదరాబాద్‌లోనే ‘వేస్ట్ డీకంపోజర్’ సీసాల విక్రయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) ద్వారా సేంద్రియ సర్టిఫికేషన్ పొంద దలచిన రైతులకు ఏడాది పాటు ఉచిత సేవలు అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ప్రాంతీయ మండలిగా గుర్తింపు పొందిన మార్క్ అగ్రి జెనెటిక్స్ ప్రై. లిమిటెడ్ డైరెక్టర్ పి. చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న రైతులకు సేంద్రియ సేద్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు సొంత బ్రాండ్‌ను రూపొందించుకొని.. దేశ, విదేశీ మార్కెట్లలో తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తోడ్పడతామన్నారు. వేస్ట్ డీకంపోజర్ సీసాలను ఘజియాబాద్ నుంచి తెప్పించుకోనవసరం లేదని, హైదరాబాద్‌లోని తమ కార్యాలయం నుంచి రూ. 20లకు కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: మార్క్ ప్రోగ్రీన్ సేంద్రియ రైతుల సేవా కేంద్రం, 416/ఎ, బాబూఖాన్ ఎస్టేట్, బషీర్‌బాగ్, హైదరాబాద్–500001. 040– 23235858, 91009 80757.