పనికిరాని మొక్క!
ఆత్మబంధువు
ఆనంద్ ఆఫీసుకు, పిల్లలు స్కూల్కు వెళ్లిపోయాక రేఖ వంటపనిలో మునిగి పోయింది. ఇంతలో డోర్బెల్ మోగింది. ఈ టైమ్లో ఎవరా అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. పక్కింటి మాధవి. ‘‘రండి ఆంటీ’’ అంటూ లోపలికి ఆహ్వానించింది రేఖ. ఈ టైమ్లో వచ్చా రేమిటా అనుకుంటూనే కాఫీ తెచ్చిచ్చింది. కాసేపు అదీ ఇదీ మాట్లాడుకున్న తర్వాత మాధవి అసలు విషయానికి వచ్చింది. ‘‘రేఖా.. మా అబ్బాయి రాము ఈ మధ్యే ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు. వస్తుందన్న నమ్మకమూ లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వేదైనా సలహా చెప్తావేమోనని వచ్చా’’ అంది మాధవి.
‘‘అసలిప్పుడేం చేస్తున్నాడు ఆంటీ?’’
‘‘ఏం చేస్తున్నాడో చెప్పడు. కానీ ఎప్పుడూ ఊళ్లు పట్టుకు తిరుగు తుంటాడు. వాడెందుకూ పనికి రాకుండా పోతాడేమోనని భయమేస్తోంది.’’
మాధవి వాళ్లది పక్కిల్లే. వాళ్లింట్లో మాట్లాడుకునే మాటల్లో కొన్ని రేఖకు వినిపిస్తూనే ఉంటాయి. రామూని నిత్యం పనికిరాని వాడని తిట్టడం రోజూ ఆమె చెవిన పడుతూనే ఉంటుంది. అలా అనకూడదని చెప్పాలని చాలాసార్లు అనుకుంది, కానీ చెప్పలేకపోయింది. ఇప్పుడు సమయం, సందర్భం వచ్చాయి.
‘‘ఆంటీ... నేను మీకో కథ చెప్తాను, వింటారా?’’ అని అడిగింది.
నేను సలహా కోసం వస్తే ఈ పిల్లేంటీ కథలంటోంది అనుకుంటూనే... ‘‘చెప్పు రేఖా’’ అంది మాధవి.
‘‘పూర్వం జీవకుడు అనే వ్యక్తి ఆయుర్వేదం నేర్చుకోవాలని ఓ గురువు దగ్గర చేరాడు. ఏళ్ల తరబడి శిష్యరికం చేశాడు. విద్య పూర్తయి వెళ్లిపోయే రోజు వచ్చింది. గురువుగారు జీవకుడ్ని పిలిచి ‘నీ విద్యాభ్యాసం పూర్తయింది. చివరగా ఒక పరీక్ష పెడతాను. ఉత్తీర్ణుడవైతే నువ్వు సొంతగా వైద్యం ప్రారంభించవచ్చు’ అని చెప్పాడు. ఆజ్ఞాపించమన్నాడు జీవకుడు. తాముంటున్న అరణ్యంలో వైద్యానికి పనికి రాని మొక్క ఏదైనా తీసుకువస్తే పరీక్షలో ఉత్తీర్ణుడైనట్లేనన్నాడు గురువు.
చిటికెలో తీసుకొస్తానంటూ జీవకుడు అరణ్యంలోకి వెళ్లాడు. సూర్యాస్తమయం అవుతోంది, జీవకుడు రాలేదు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. జీవకుని జాడ లేదు. దాదాపు ఏడాది తర్వాత మీసాలు, గడ్డాలతో తిరిగి వచ్చాడు. ‘గురుదేవా... వైద్యానికి పనికిరాని మొక్క కోసం ఏడాది పాటు అరణ్యమంతా అన్వేషించాను. ఒక్కటీ కానరాలేదు. నేను వైద్యుడిగా పనికిరానా గురుదేవా?’ అంటూ రోదించాడు. అప్పుడు గురువు... ‘భూమి మీద కనపడే ప్రతి మొక్కా వైద్యానికి ఉప యోగపడేదే. ఆ విషయం తెలుసుకోవడం తోనే నువ్వు ఉత్తీర్ణుడివయ్యావు’ అన్నాడు.
‘‘అంటే... ప్రపంచంలోని మొక్కలన్నీ వైద్యానికి పనికొస్తాయా రేఖా?’’ ఆశ్చర్యంగా అడిగింది మాధవి.
‘‘అవునాంటీ... ప్రతి మొక్కా ఏదో విధంగా వైద్యానికి పనికొస్తుంది. అలాగే ప్రపంచంలోని మనుషులందరూ ఏదో ఒక రకంగా సమాజానికి పనికొస్తారు. పనికి మాలిన మొక్కలు, పనికిమాలిన మనుషు లంటూ ఎవ్వరూ ఉండరు’’ చెప్పింది రేఖ.
రేఖ ఆ మాట ఎందుకు చెప్పిందో మాధవికి అర్థమైంది. ‘‘నువ్వు చెప్పింది నిజం కావొచ్చు రేఖా. కానీ మా వాడి విషయం వేరు. నిజంగానే వాడెందుకూ పనికి రాకుండా పోతున్నాడనే మా బాధంతా’’ అంది బాధగా.
‘‘రామూకేం తక్కువాంటీ! మంచి కుర్రాడు, బాగా మాట్లాడతాడు, పాటలు పాడతాడు, పదిమందినీ చక్కగా ముందుకు నడిపించగలడు.’’
‘‘అదేనమ్మా అసలు సమస్య. అన్నీ చేస్తాడు, ఉద్యోగం తప్ప. అదే చాలా గొడవగా ఉంది ఇంట్లో.’’
‘‘ఉద్యోగం అంటే ఏంటి ఆంటీ?’’
‘‘అదేంటి రేఖా అలా అడిగావ్? అందరూ చేసేదే. ఏదో ఒక ఆఫీసులో చక్కగా ఉద్యోగం చేసుకుంటే ఎంత బావుంటుందీ.’’
‘‘ఆంటీ... రామూ నైన్ టూ ఫైవ్ జాబ్ చేయాలని మీరు చూస్తున్నారను కుంటా. కానీ నేను అబ్జర్వ్ చేసిన మేరకు, నాకు తెలిసినంత వరకు అతను అలాంటి జాబ్ చేయలేడు. మీరు బలవంతంగా చేర్పించినా అక్కడ ఇమడలేడు.’’
‘‘మరెలా రేఖా?’’
‘‘మీరు 7/జి బృందావన్ కాలనీ సినిమా చూశారా? అందులో హీరో ఎందుకూ పనికిరాని వాడని అందరూ తిడుతుంటారు. హీరోయిన్ కూడా తిట్టేస్తుంది. కానీ బైక్ మెకానిజంలో అతనో జీనియస్ అని చివరకు గుర్తిస్తుంది. అలాగే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆంటీ. దాన్ని గుర్తించి ప్రోత్సహించాలంతే!’’
రేఖ చెప్పింది మాధవికి అర్థమైంది. తన కొడుకు విషయంలో తర్వాత తానేం చేయాలో ఆలోచిస్తూ వెళ్లిపోయింది.
- డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్