నలుగురు కానిస్టేబుళ్లు.. సీఐ కొడుకు అరెస్టు
హైదరాబాద్: ఓ వాచ్మెన్పై దాడి చేసిన కేసులో నలుగురు పోలీసులను, మరో పోలీసు అధికారి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. స్వచ్చందంగా వారు తాము చేసిన తప్పును అంగీకరించారు. సైదాబాద్‌లోని కరన్ బాగ్ ప్రాంతంలో బీడీఆర్ టవర్స్ అనే అపార్ట్మెంట్లో చిట్యాల అమృత్ అనే వ్యక్తి వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. దీని పక్కనే వికారాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వేణుగోపాల్రాజ్ కుమారుడు అంబటి పృథ్వీరాజ్ కూడా ఉంటున్నాడు. అతడు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. అపార్ట్మెంట్ వాచ్మెన్ అమృత్‌తో అతడు తరచు గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే పృథ్వీరాజు.. వాచ్మెన్ అమృత్‌తో 31వ తేదీ రాత్రి గొడవ పడ్డాడు. అపార్ట్మెంట్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు.
పృథ్వీ బెదిరించినా అమృత్ వెళ్లలేదు. దీంతో అతడు వెళ్లి తన తండ్రితో చెప్పడంతో భూరంతపల్లి శివరాజ్, చాకలి మల్లేశ్, ఉప్పరి రవి కుమార్, అంతిగిరిపల్లి రాజ్‌కుమార్ అనే నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు అమృత్ ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దకు వచ్చి అతడిపై దాడి చేశారు. ఈడ్చుకెళ్లి కొట్టుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లి మరోసారి కొట్టి విడిచిపెట్టారు. అతడి భార్య యాదమ్మ అడ్డుపడటంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నట్లు తెలిసింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. ఇది కాస్త వెలుగులోకి రావడంతో తీవ్ర స్థాయిలో సదరు పోలీసు అధికారి కుమారుడిపై విమర్శలు తీవ్ర స్థాయిలో వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసుకున్న పోలీసులు మొత్తం ఐదుగురుని అరెస్టు చేసి విచారిస్తున్నారు.