వెనుకడుగే..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మెనేజ్మెంట్ ప్రోగ్రాం(ఐడబ్ల్యూంపీ) అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల కుమ్ములాటలతో లక్ష్యం నీరుగారిపోతుంది. ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి గడువులోగా పనులు పూర్తిచేయాలని ఆదేశించినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. దీంతో జిల్లాకు మంజూరైన నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయల విలువచేసే అభివృద్ధి పనులకు ఇకపై ఫుల్స్టాప్ పడనుంది.
ఐడ బ్ల్యూఎంపీ పథకం ఇలా...
వెనుకబడిన ప్రాంతాల్లో సహజ వనరులను పెంపొందించి.. పేదలకు జీవనోపాధిని కల్పించేందుకు జిల్లాకు 2009-10 నుంచి ఈ ఏడాది వరకు 6 బ్యాచ్‌లుగా 63 మండలాల్లో 103 ప్రాజెక్టులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టుల అమలుకు 90 శాతం కేంద్రం, 10శాతం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రూ.518.94 కోట్లు మంజూరయ్యాయి. అయితే, ఆరేళ్ల కాలంలో కేవలం రూ.70.24 కోట్లను మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఇంకా రూ.448.72 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఒక్కో బ్యాచ్ కింద ప్రాజెక్ట్‌లకు విడుదలైన మొత్తాన్ని ఐదేళ్లలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఐదేళ్లలో ఖర్చు చేయని నిధులను ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుంది. జిల్లాలో అమలయ్యే మొదటి, రెండవ బ్యాచ్‌ల కాల పరిమితి ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది.దీంతో వీటికి కేటాయించిన నిధులు దాదాపు రూ.149.11కోట్లు వెనక్కువెళ్లే పరిస్థితి ఏర్పడింది.
అమలు తీరిలా...
ఈ పథకం కింద ప్రాజెక్ట్ వ్యయంలో 10శాతం నిధులు ప్రాజెక్ట్ నిర్వహణకు, 5శాతం రైతుల, ఉద్యోగుల శిక్షణ కోసం, 1శాతం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు తయారీకి కేటాయిస్తారు. అంతేకాకుండా ఎంట్రీపాయింట్ అక్టీవిటిస్(ఈపీఏ) కింద గ్రామాలలో పశువుల నీటితొట్లు, సోలార్లైట్లు, తాగునీటి ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు వంటి వాటి కోసం 4శాతం నిధులు కేటాయిస్తారు. సహ జ వనరుల యాజమాన్యం కింద 56శాతం నిధులను గ్రామాల్లో సహజ వనరులను కాపాడేందుకు వినియోగిస్తారు. వీటికింద చెక్‌డ్యాం, చెక్‌వాల్స్ నిర్మాణాలు, ఉద్యానవన తోటల పెంపకం వంటి వాటికి వినియోగిస్తారు. అలాగే ఉత్పాదక పెంపుదల(పీఎస్ఐ) కింద 10శాతం నిధులను వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలు, మత్స్యకారుల సామాగ్రి కొనుగోలు, పశువైద్యశిబిరాలు వంటి వాటికి వినియోగిస్తారు.
మరో 9శాతం నిధులను జీవనోపాధి కల్పించేందుకు కుటీర పరిశ్రమలకు చేయూత, పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాల ఏర్పాటు, టైలరింగ్ వంటి పనులకు రుణాలు అందిస్తారు. మరో 5 శాతం నిధులను ప్రాజెక్ట్ మూల్యాంకనం, పర్యవేక్షణ, కన్సాలిడేషన్ కోసం వినియోగిస్తారు. కాగా నిధులను ఐదేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయిలో నిధులను సద్వినియోగం చేసుకున్న దాఖ లాలు కనిపించడం లేదు.
రూ.149.11 కోట్లు వెనక్కి.?
2009-10 బ్యాచ్‌కు చెందిన ప్రాజెక్ట్‌ల కాల పరిమితి గతేడాదితోనే ముగిసింది. అయితే, నిధులను సకాలంలో వాడుకోకపోవడంతో అప్పటి అధికారులు మరో ఏడాది గడువు కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. అందుకు స్పందించిన అప్పటి ప్రభుత్వం మరో ఏడాది గడువు పొడగించింది.
దీంతో ఈ ఏడాది మార్చి31వ తేదీతో ప్రభుత్వం పొడగించిన గడువు ముగుస్తుంది. ఈ బ్యాచ్ కింద 34మండలాల్లో 16 ప్రాజెక్టులకు రూ.76. 98కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ.23.14 కోట్లు మాత్రమే ఖర్చు చేయాగలిగారు. ఖర్చుచేయని దాదా పు రూ.53.85 కోట్లు వెనక్కి వెళ్లనున్నాయి. అదేవిధంగా 2010-11లో రెండో విడుతగా 34మండలాల్లో 22 ప్రాజెక్టులకు రూ.114.21 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు కేవలం రూ.18.95 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతావి తిరిగి వెనక్కి వెళ్లనున్నాయి. ఇలా రెండు బ్యాచ్‌లు కలిపి రూ.149.11 కోట్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.
నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది
2009-10, 2010-11 బ్యాచ్‌ల గడువు ఈ ఏడాది 31తో ము గియనుంది. వీటికి కేటాయించిన నిధులను సకాలంలో వాడుకోకపోవడంతో రూ.149.11 కోట్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉన్న మాట వాస్తవమే. మా ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి మరింత గడువు పెంచేలా విధంగా కోరతాం. ఇక మిగిలిన ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తాం.
-డ్వామా పీడీ సునందరాణి