Water clouds
-
సుదూర విశ్వంలో అఖండ జలనిధి! భూమి కంటే 140 లక్షల కోట్ల రెట్లు
ఖగోళ శాస్త్రవేత్తలు సంచలన విషయాన్ని కనుగొన్నారు. మనకు తెలిసిన విశ్వంలో ఇప్పటివరకు ఎవరూ కనుక్కోని ఊహకే అందనంత అతిపెద్ద, అత్యంత సుదూర నీటి మేఘాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై ఉన్న నీటి కంటే 140 లక్షల కోట్ల రెట్ల భారీ జలనిధిని బహిర్గతం చేశారు. యూనిలాడ్ (UNILAD) అనే బ్రిటిష్ ఇంటర్నెట్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ప్రకారం.. క్వేసార్ (quasar) అని పిలిచే ఒక భారీ ఫీడింగ్ బ్లాక్ హోల్ చుట్టూ ఇది నీటి ఆవిరి రూపంలో విస్తరించింది. ఈ విస్తారమైన కాస్మిక్ నీటి వనరు వేల కోట్ల కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరంలో ఉంది. అంతరిక్షంలో ఉన్న నీటితో పోలిస్తే ఈ నీటి ఆవిరి మేఘం వెచ్చగా ఉంటుంది. భూమిపై ఉండే వాతావరణం కంటే 300 లక్షల రెట్లు తక్కువ సాంద్రత ఉంటుంది. పరిమాణానికి తగ్గట్టే అంతరిక్షంలోని ఈ నీటి మేఘం వందల కాంతి సంవత్సరాల విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన మ్యాట్ బ్రాఫోర్డ్ ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజేశారు. అత్యంత ప్రారంభ సమయాల్లోనే నీరు విశ్వం అంతటా వ్యాపించి ఉందనటానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. -
సౌర కుటుంబానికి ఆవల నీటి మేఘాలు
మన సౌర కుటుంబానికి ఆవల 7.2 కాంతి సంవత్సరాల దూరంలో నీటి మేఘాలు ఉన్నట్లు పెన్సల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జూపిటర్ గ్రహం కన్నా ఐదు రెట్లు పెద్దగాను, మన సూర్యుడికన్నా చిన్నగాను ఉన్న ఈ నీటి మేఘాలను ఖగోళ శాస్త్రంలో విఫలమైన నక్షత్రాంగాను లేదా బ్రౌన్ డ్వార్ఫ్గాను పిలుస్తారు. ధూళి, గ్యాస్‌తో కూడిన మేఘాలే గురుత్వాకర్షణ శక్తితో కేంద్రీకృతమై అణు విస్ఫోటనం సంభవించడం వల్ల నక్షత్రాలుగా పరిణామం చెందుతాయన్న విషయం తెల్సిందే. అణు విస్ఫోటనం సంభవించేంత ద్రవ్యరాశి లేకుండా శీతలీకరణం చెందిన పదార్థాన్ని విఫలమైన నక్షత్రం లేదా బ్రౌన్ డ్వార్ఫ్ అంటారు. మన భూమికి 7.2 కాంతి సంవత్సరాల దూరంలో బ్రౌన్ డ్వార్ఫ్ ఉన్నట్లు రెండేళ్ల క్రితమే గుర్తించిన పెన్సల్వేనియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీనికి ‘వైస్ 0855’గా నామకరణం చేశారు. పెన్సల్వేనియా యూనివర్శిటీలోని ‘సెంటర్ ఫర్ ఎక్సోప్లానెట్స్ అండ్ హబిటెబుల్ వరల్డ్స్’కు చెందిన శాస్త్రవేత్తలు హవాయిలోని జెమినీ నార్త్ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఇన్ఫ్రారెడ్ మెజర్మెంట్స్ పద్ధతిలో వైస్ 0855ను అధ్యయనం చేయడం ద్వారా అందులో నీటి ఆవిరులు ఉన్నట్లు కనుగొన్నారు. అందులో మైనస్ పది ఫారన్‌హీట్ డిగ్రీల శీతల వాతావరణం కూడా ఉన్నట్లు అంచనా వేశారు. సౌర కుటుంబానికి ఆవల మనకు సమీపంలోనే నీటి మేఘాలు ఉండడం అమితాశ్చర్యకరమైన విషయమని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రానమర్ కెవిన్ లుహ్మాన్ వ్యాఖ్యానించారు. ఈ అధ్యయనానికి సంబంధించి పూర్తి వివరాలను ‘ఆస్ట్రోఫిజికల్ జనరల్ లెటర్స్’ మేగజైన్లో ప్రచురిస్తామని ఆయన చెప్పారు. -
సూర్యుడికి ఆవల నీటి మేఘాలు!
మన సౌరకుటుంబంలో నీటి మేఘాలు ఆవరించి ఉన్నది ఒక్క భూగోళంపై మాత్రమే. సౌరకుటుంబం ఆవల అచ్చం భూమిలాంటి గ్రహాలు మూడునాలుగు ఉన్నాయని కనుగొన్నా.. వాటిపై నీటిమేఘాలు ఆవరించి ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం ఇప్పటిదాకా స్పష్టంగా తెలియలేదు. అయితే.. మన కు 7.3 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహానికి ఎక్కువ.. నక్షత్రానికి తక్కువ అయిన ఓ మరుగుజ్జు నక్షత్రం(బ్రౌన్ డ్వార్ఫ్)పై మన భూమిలాగే నీటి మేఘాలు ఉన్నాయట. ఇలా సౌరకుటుంబం ఆవల నీటిమేఘాలను కనుగొనడం ఇదే తొలిసారని అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా బూడిదరంగు మరుగుజ్జు నక్షత్రాలు గురుగ్రహం కన్నా 15-75 రెట్లు పెద్దగా ఉంటాయని, ‘వైజ్ జే0855-0714’ అనే ఈ నక్షత్రం గురుగ్రహం కన్నా 10 రెట్లు పెద్దగా ఉందని వారు అంచనా వేశారు. ఇప్పటిదాకా కనుగొన్న అన్ని బ్రౌన్ డ్వార్ఫ్లలో అత్యంత చల్లనిది కూడా ఇదేనట. ఇలాంటి మరుగుజ్జు నక్షత్రాలకు అటు నక్షత్రం పోలికలు ఉన్నా.. కేంద్రభాగంలో కేంద్రక సంలీన చర్యలు జరగవు. ఇటు గ్రహం పోలికలు ఉన్నా.. గ్రహాల కన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉండటం వల్ల వీటిని విఫల నక్షత్రాలుగా పిలుస్తారు.