సూర్యుడికి ఆవల నీటి మేఘాలు!
మన సౌరకుటుంబంలో నీటి మేఘాలు ఆవరించి ఉన్నది ఒక్క భూగోళంపై మాత్రమే. సౌరకుటుంబం ఆవల అచ్చం భూమిలాంటి గ్రహాలు మూడునాలుగు ఉన్నాయని కనుగొన్నా.. వాటిపై నీటిమేఘాలు ఆవరించి ఉన్నాయా? లేదా? అన్నది మాత్రం ఇప్పటిదాకా స్పష్టంగా తెలియలేదు. అయితే.. మన కు 7.3 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహానికి ఎక్కువ.. నక్షత్రానికి తక్కువ అయిన ఓ మరుగుజ్జు నక్షత్రం(బ్రౌన్ డ్వార్ఫ్)పై మన భూమిలాగే నీటి మేఘాలు ఉన్నాయట. ఇలా సౌరకుటుంబం ఆవల నీటిమేఘాలను కనుగొనడం ఇదే తొలిసారని అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
సాధారణంగా బూడిదరంగు మరుగుజ్జు నక్షత్రాలు గురుగ్రహం కన్నా 15-75 రెట్లు పెద్దగా ఉంటాయని, ‘వైజ్ జే0855-0714’ అనే ఈ నక్షత్రం గురుగ్రహం కన్నా 10 రెట్లు పెద్దగా ఉందని వారు అంచనా వేశారు. ఇప్పటిదాకా కనుగొన్న అన్ని బ్రౌన్ డ్వార్ఫ్‌లలో అత్యంత చల్లనిది కూడా ఇదేనట. ఇలాంటి మరుగుజ్జు నక్షత్రాలకు అటు నక్షత్రం పోలికలు ఉన్నా.. కేంద్రభాగంలో కేంద్రక సంలీన చర్యలు జరగవు. ఇటు గ్రహం పోలికలు ఉన్నా.. గ్రహాల కన్నా ఎన్నో రెట్లు పెద్దగా ఉండటం వల్ల వీటిని విఫల నక్షత్రాలుగా పిలుస్తారు.