Water Electricity
-
రుతుపవనాలపై కచ్చిత సమాచారం
కొత్త విధానం రూపొందించిన జర్మన్ శాస్త్రవేత్తలు బెర్లిన్: భారత్‌లో రుతుపవనాల ఆగమనం, నిష్ర్కమణాన్ని ముందుగానే కచ్చితంగా అంచనా వేసే కొత్త పద్ధతిని జర్మనీ వాతావరణ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సరికొత్త విధానం భారత ఉపఖండంలో ఆహారోత్పత్తితో పాటు జల విద్యుత్‌ను పెంచేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు చె బుతున్నారు. ప్రాంతీయ వాతావరణ సమాచారం సమగ్ర విశ్లేషణ ఆధారంగా ఈ విధానం పనిచేస్తుందని, దీన్ని ఉపయోగిస్తే భారత వాతావరణ విభాగం మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. రుతుపవనాల రాకపై 70 శాతం సరైన సమాచారం ఇచ్చిందని, నిష్ర్కమణంపై 80 శాతం కచ్చితంగా ఫలితం వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఎల్ నినో, లా నినా సమయాల్లో రుతుపవనాల అంచనాపై మెరుగైన సమాచారం ఇస్తుందని జర్మన్ పరిశోధకులు అంటున్నారు. జర్మనీలో పోట్సడామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్(పీఐకె) చెందిన వెరోనికా స్టొల్బోవా మాట్లాడుతూ... కొత్త పద్ధతితో భారత్‌లో రుతుపవనాల రాకను రెండు వారాల ముందుగానే అంచనా వేయగలమని, నిష్ర్కమణను ఆరు వారాల ముందుగానే చెప్పవచ్చన్నారు. ఉత్తర పాకిస్తాన్, తూర్పు కనుమలు, హిందూ మహాసముద్రానికి సమీపంలోని పర్వత ప్రాంతాలు, కేరళల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు, తేమ రుతుపవనాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించామన్నారు. -
జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు
సాక్షి, హైదరాబాద్/జూరాల: జల విద్యుత్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. జలాశయాలకు వరద నీటి ప్రవాహం జోరందుకుంటోంది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రియదర్శని జూరాల జలాశయం పూర్తి సామర్థ్యం మేర నిండింది. దీంతో జలాశయం ఎగువ విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా గురువారం నుంచి విద్యుదుత్పత్తిని తెలంగాణ జెన్కో ప్రారంభించింది. 234 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ కేంద్రంలో ప్రస్తుతం 4 టర్బైన్ల ద్వారా 156 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేస్తూ 26 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. జూరాలకు వరద ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పెరిగితే ఈ కేంద్రం ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగనుంది. వాస్తవానికి గత జూలైలోనే విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని, ఆగస్టుకి 1,000 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని విద్యుత్ శాఖ ఆశలు పెట్టుకుంది. వర్షాభావం ఈ ఆశలను వమ్ము చేసింది. సీఎం కేసీఆర్ చైనా టూర్‌కు ముందు విద్యుత్ సరఫరాపై సమీక్ష జరిపి ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు జల విద్యుదుత్పత్తి ప్రారంభమవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సైతం భవిష్యత్తులో ఉత్పత్తికి అవకాశం ఉందని జెన్కో అధికారుల అంచనా. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటలు, రబీ పంటలకు విద్యుత్ సరఫరా అవసరాలు తీర్చడానికి జల విద్యుత్ కీలకం కానుంది. జూరాల రిజర్వాయర్ నీటిమట్టం 10.76 టీఎంసీలకు చేరడంతో ప్రధాన కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపేందుకు వేయి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు పంటలకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనులూ ముగింపు దశకు చేరుకున్నాయి.