పారదర్శకంగా ‘ఉపాధి’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనుల్లో ఎలాంటి అవకతవకలకు చోటుచేసుకోకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ హరినాథరెడ్డి అన్నారు. అడిగిన వారందరికీ సమాజానికి ఉపయోగపడే పనులు కల్పిస్తూ వలసలను నివారించడమే లక్ష్యంగా కృషి చేస్తామని చెప్పారు. ఉపాధి పనుల సీజన్ మొదలైన నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సారి ఎలాంటి పనులు చేపట్టనున్నారు?
పీడీ: ఈ సారి అన్నీ ఉపయోగపడే పనులు కల్పించనున్నాం. పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు భారీగా నిర్మించబోతున్నాం. డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయనున్నాం. రైతులకు సేంద్రీయ ఎరువుల తయారీకి నాడెప్ కంపోస్టు పిట్లు నెలకొల్పనున్నాం. కరెంటు ఉన్నప్పుడు నీటిని నిల్వ చేసుకుని కరెంటు లేనప్పుడు పంటలకు పారించుకోవడానికి వీలుగా భూ ఉపరితల ట్యాంకులు నిర్మించనున్నాం. పండ్ల తోటలు, బండ్ ప్లాంటేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
న్యూస్‌లైన్: రైతుల కోసం ఎలాంటి పనులు చేపడుతున్నారు?
పీడీ: రైతులకు శాశ్వత ప్రయోజనాలు ఉండే పనులు కల్పిస్తున్నాం. నంద్యాల డివిజన్లో చేలగట్ల వెంట పెద్ద ఎత్తున కొబ్బరి మొక్కలు నాటి కోనసీమ తరహాలో అభివృద్ధి చేయనున్నాం. కర్నూలు, ఆదోని డివిజన్లలో కొబ్బరితో పాటు టేకు మొక్కలు నాటనున్నాం. మొత్తం మీద 20 లక్షల మొక్కలు అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఆరువేల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేయనున్నాం.
న్యూస్‌లైన్: అక్రమాలను ఎలా అధిగమిస్తారు?
పీడీ: రోజువారిగా మస్టర్, మెజర్‌మెంట్లపై ఎస్ఆర్డీ నుంచే క్రాస్ చెకింగ్ ఉంటుంది. దీనికి తోడు సామాజిక తనిఖీలు ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు ఉంటాయి. ప్రస్తుతం జాబ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నాము. అయినా అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులను ఇంటికి పంపడమే కాక క్రిమినల్ కేసులు, రికవరీ అన్నీ ఉంటాయి.
న్యూస్‌లైన్: జిల్లాలో ప్రస్తుతం ఉపాధి పనులు కల్పించడం నామమాత్రంగానే ఉంది కదా?
పీడీ: గత డిసెంబర్ రెండోవారం నుంచే పనులు ప్రారంభించాం. ప్రస్తుతం లేబర్ రిపోర్టింగ్ రోజూ 16 వేల వరకు ఉంది. దీనిని 50 వేలకు పెంచనున్నాం. వలసలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పనులు కల్పిస్తున్నాం.
న్యూస్‌లైన్: పనులు కావాలంటే కూలీలు ఏమి చేయాలి.. ఎవరిని కలవాలి?
పీడీ: రెండు రకాలుగా మస్టర్లు వేస్తారు. గ్రామాల్లోని శ్రమశక్తి సంఘాలను రెండు బ్యాచ్‌లుగా చేస్తారు. మొదటి బ్యాచ్ మస్టర్ సోమవారం మొదలవుతుంది. ఈ బ్యాచ్ వారి పని కోసం గురు, శుక్రవారాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు డిమాండ్ ఇవ్వాలి. ప్రాథమిక పనులన్నీ పూర్తి చేసి 4 రోజుల నుంచి 14 రోజుల్లో పని కల్పిస్తారు. రెండో బ్యాచ్ మస్టర్ గురువారం మొదలవుతుంది. వీరు శని, సోమవారాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లకు డిమాండ్ ఇస్తే 4 నుంచి 14 రోజుల్లో పని కల్పిస్తారు. అలా పనులు కల్పించకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తాం.
న్యూస్‌లైన్: 2013-14 ఆర్థిక సంవత్సర లక్ష్యాలను ఎంతవరకు సాధించారు?
పీడీ: ఈ ఆర్థిక సంవత్సరంలో 1.80 కోట్ల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం. ఇప్పటివరకు 1.15 కోట్ల పనిదినాలను కల్పించాం. ఇంక 70 లక్షల పనిదినాలను మార్చిలోగా కల్పించాలని లక్ష్యంగా తీసుకున్నాం. జనవరిలో 15 లక్షలు, ఫిబ్రవరిలో 20 లక్షలు, మార్చిలో 35 లక్షల పనిదినాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటివరకు 15,500 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాం.