గాల్లోంచి నీరు పుట్టిస్తారు..!
ఎక్స్‌ప్రైజ్.. ఈ పేరు చాలా తక్కువగానే విని ఉంటారుగానీ.. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కొనేందుకు పోటీలు పెడుతుంటుంది ఈ సంస్థ. పీటర్ డెమండిస్ అనే వ్యాపారవేత్త 1995లో దీన్ని స్థాపించారు. రెండేళ్ల కింద ‘వాటర్ అబండెన్స్’అనే పోటీ పెట్టింది. గాల్లోని తేమను అతిచౌకగా నీరుగా మార్చే యంత్రం, లేదా సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 10.5 లక్షల డాలర్లు.. (రూ.9.75 కోట్లు) ఇస్తామని ప్రకటించింది. రోజుకు కనీసం 2 వేల లీటర్ల నీరు ఉత్పత్తి చేయాలని, ఒక్కో లీటరు నీటి తయారీకి 2 సెంట్ల (రూ.1.28)కు మించి ఖర్చు కాకూడదన్నవి నిబంధనలు. మొత్తం 98 సంస్థలు ఈ ప్రైజ్‌మనీ కోసం పోటీపడ్డాయి. రెండు వారాల కింద తుది పోటీలకు 5 జట్లు ఎంపికైనట్లు ప్రకటించింది. ఆ జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఉరవు’ఉంది. ఉరవు వ్యవస్థాపకుడే స్వప్నిల్!
మూడేళ్లలో 80 పైసలకే లీటర్..
నమూనా యంత్రం ద్వారా లీటర్ నీరు ఉత్పత్తి చేసేందుకు దాదాపు రూ.2 ఖర్చు అవుతోందని, సిలికా పదార్థం ఆధారంగా నమూనా యంత్రాన్ని తయారు చేశామని స్వప్నిల్ చెప్పారు. మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలగడంతో పాటు ఖర్చు తగ్గిస్తామని పేర్కొన్నారు. మరో మూడేళ్లలో నీటి ఉత్పత్తి ఖర్చును లీటర్‌కు 80 పైసలకు తగ్గించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌ప్రైజ్ ఫౌండేషన్ ఫైనల్ పోటీలు ఈ ఏడాది జూలైలో జరగబోతున్నాయని పేర్కొన్నారు. నమూనా యంత్రాన్ని హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా పరీక్షించామని, వాతావరణంలో తేమ తక్కువగా ఉండే డిసెంబర్‌లోనూ పూర్తిస్థాయిలో నీరు ఉత్పత్తి చేయగలిగినట్లు వివరించారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని, ఇందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘గాల్లోంచి నీరును ఉత్పత్తి చేసే యంత్రాలు ఇప్పటికే చాలా ఉన్నా వాటి ఖరీదు చాలా ఎక్కువ. ఇంటి అవసరాలు తీర్చే యంత్రం ఖరీదు రూ.50 వేల వరకు ఉండొచ్చు. ఒకసారి ఇంట్లో పెట్టుకుంటే చాలు.. దీర్ఘకాలం పాటు స్వచ్ఛమైన మంచినీరందిస్తుంది’అని స్వప్నిల్ వివరించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
చేతులు కలిపిన యువశక్తి..
ఐదుగురు యువకులు కలసి ఈ సంస్థను స్థాపించారు. స్వప్నిల్ ఆర్కిటెక్చర్ చదివితే అమిత్ ఎంబెడెడ్ డిజైనింగ్‌లో డిప్లొమో చేశాడు. వీరికి మెకా నికల్ ఇంజనీరింగ్ చేసిన భరత్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విద్యనభ్యసించిన సందీప్, ఆర్కిటెక్చర్ చదు వుకున్న వెంకటేశ్ తోడయ్యారు. అందరూ చదువుకు న్నది కేరళలోని కాలికట్లో. ఎక్స్‌ప్రైజ్ పోటీ ముందే వీరంతా కలసి గాల్లోంచి నీటిని ఉత్పత్తి చేసేందుకు ఓ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. సంక్షేపణం అనే భౌతిక ప్రక్రియ ద్వారా ఇది పనిచేస్తుంది. ఎవా అని దీనికి పేరు పెట్టారు. గాజు గ్లాసులో చల్లటి నీటిని ఆరుబయట పెడితే గ్లాస్ బయటివైపున నీటి బిందు వులు ఏర్పడతాయి కదా అలాగన్నమాట. ఇది పనిచే సేందుకు విద్యుత్ అవసరం. ఎక్స్‌ప్రైజ్ నిబంధనల ప్రకారం పూర్తిగా సంప్రదాయేతర ఇంధన వనరుల పైనే ఆధారపడాలి. దీంతో ప్రత్యేకమైన డిజైన్‌ను ఉపయోగించామని, అదనపు ఖర్చుల్లేకుండా ఎక్కడైనా నీరు ఉత్పత్తి చేయొచ్చని స్వప్నిల్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సరికొత్త యంత్రంతో రోజుకు 15–20 లీటర్ల నీరు ఉత్పత్తి చేయొచ్చని అన్నారు.
స్వప్నిల్ (ఎడమ నుంచి రెండో వ్యక్తి) బృందం