ప్చ్..
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర బడ్జెట్లో జిల్లా విషయంలో స్పష్టమైన వివక్షత కన్పించింది. జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధ వహించారు. జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరి-నగరి సుజల స్రవంతి పథకం నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి ఫలాలందించే పథకాలకు నిధుల కేటాయింపులు లేవు. ట్రిపుల్ఐటీ, యోగివేమన యూనివర్శిటీ, రిమ్స్ వంటి అత్యున్నత విద్యాసంస్థల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాపట్ల రాజకీయ వైరాన్ని ప్రదర్శిస్తున్నారని బడ్జెట్ సాక్షిగా చెప్పకనే చెప్పారు.
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు, ఇతర సంస్థలకు భారీ కోత పెట్టారు. పథకాలను ప్రాధాన్యత పరంగా సమదృష్టితో చూడాల్సిన పాలకపక్షం రాజకీయ వైరంతో అరకొర నిధులను విదిల్చారు. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల ఊసే ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్లో లేకపోవడం విచారకరం.
మెట్టప్రాంతాల పట్ల కన్పించని శ్రద్ద....
మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రవేశ పెట్టిన జలయజ్ఞం పనులు కాలక్రమేపి వివ క్షతకు గురవుతున్నాయి. జిల్లాలో 2004-09 హయాంలో నిర్వహించిన పనుల ఆధారంగా జిల్లాకు కృష్ణా జలాలు అందుతాయని ప్రజానీకం పూర్తి ఆశల్లో ఉండే ది. పాలకుల శీతకన్ను కారణంగా పెండింగ్ పథకాల జాబితాలోకి జిల్లా సాగునీటి పథకాలు చేరిపోయాయి. వెనుకబడ్డ రాయలసీమకు సాగునీటి వసతి కల్పించాలనే లక్ష్యంతో జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టారు. అంతే శ్రద్ధతో ఆ పథకాల పూర్తికి చిత్తశుద్ధితో ఆచరణలో చూపెట్టారు.
అలాంటి పథకాలకు అరకొర నిధులు కేటాయించి ప్రభుత్వం తన వివక్షతను ప్రదర్శిస్తోంది. మరో రూ.173 కోట్లు వెచ్చిస్తే జీఎన్ఎస్ఎస్ ఫేజ్-1 పనులు పూర్తి కానున్న నేపధ్యంలో ప్రభుత్వం కేవలం రూ.55.14కోట్లు కేటాయించింది. అందులో 50శాతం గ్రాంటు ఆర్‌అండ్‌ఆర్‌కు వినియోగించాలనే నిబంధన విధించింది. కేసీ కెనాల్ ఆధునికీకరణ పట్ల పాలకపక్షానికి చిత్తశుద్ధి లోపించింది. కేవలం రూ.8.4కోట్లు మాత్రమే కేటాయించారు. మైలవరం ఆధునికీకరణకు రూ.8.16కోట్లు, తెలుగుగంగకు రూ.89.6కోట్లు, పీబీసీకి రూ.27.8కోట్లు కేటాయించారు. అనంతపురం జిల్లాలోని హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు మాత్రం రూ.128కోట్లు కేటాయించారు. ఎస్సార్బీసీకి రూ.12.48కోట్ల కేటాయింపులు దక్కాయి. వెలిగల్లు, చెయ్యేరు, దిగువ సగిలేరు, ఎగువ సగిలేరు, బుగ్గవంక ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు లేవు.
అత్యున్నత విద్యపట్ల అదే వైఖరి....
జిల్లాలోని అత్యున్నత విద్యాసంస్థల పట్ల సైతం ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రదర్శించింది. యోగివేమన యూనివర్శిటీకీ టీడీపీ ప్రభుత్వం అరకొర ఆర్థిక కేటాయింపులే చేపట్టింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.19.39 కోట్లు కేటాయించారు. అందులో రూ.16.92కోట్లు వైవీయూ సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించనున్నారు. ఇతరత్రా వసతులకు రూ.2.47 కోట్లు వినియోగించాలని నిర్ణయించారు. అలాగే ట్రిపుల్ఐటీ, రిమ్స్‌కు ఈమారు నిధులు కేటాయింపులే లేవు. ఐజీ కార్ల్ పశుపరిశోధన సంస్థ ఊసే లేకపోయింది.