జలమార్గ రవాణాకు ప్రణాళికలు
రాష్ట్రంలో జలమార్గం ద్వారా చేపట్టాల్సిన ప్రాజెక్టులకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక అమలుకు వీలుగా రాష్ట్రస్థాయిలో సాగరమాల కమిటీని అధికారులు ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా ఓడరేవుల ఆధునికీకరణ, తీరంలో ఆర్థిక, సామాజిక పురోగతికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీకాకుళం నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు దాదాపు 974 కి.మీ పొడవున ఉన్న సముద్ర తీరం, గోదావరి, కృష్ణా తదితర నదుల వెంట జలమార్గ రవాణావ్యవస్థ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు.
1,078 కి.మీ పొడవున అంతర్గత జలరవాణావ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారుచేసి, ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. జలమార్గ రవాణా ప్రాజెక్టులో భాగంగా మొదటి విడతలో ఎన్నూరు(చెన్నై) సముద్రముఖ ప్రాంతం నుంచి పెదగంజాం వరకు దాదాపు 300 కి.మీ ఉత్తర బకింగ్ హాం కాలువను పునరుద్ధరించనున్నారు. అలాగే కొమ్మూరు, ఏలూరు, కాకినాడ కాలువల్లో తగినంత నీరు ఉంటే పెదగంజాం నుంచి కాకినాడ వరకు జలమార్గ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రెండోదశలో కృష్ణా, గోదావరి నదుల్లో 328 కి.మీ వరకు జలమార్గాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. దీంతోపాటు రూ.1,800 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జాతీయ జల మార్గ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస, మౌలిక సదుపాయాలు కల్పించాలని నివేదికలో పొందుపరిచారు.