వాటర్‌లో వర్కవుట్స్
జలకాలాడాలని అన్పించనిదెవరికి? సిక్సిటీస్లో ఉన్న వారిని కూడా సిక్స్టీన్కు లాక్కువచ్చేస్తుంది. కేరింతలు కొట్టేంత కిక్కు ఇచ్చేస్తుంది. జల‘కళ’లో ఉన్న మహాత్యమే అది. నీళ్ళు చూస్తే కలిగే ఉత్సాహమే వేరు. నీలిరంగులో నిర్మలంగా ఆహ్వానించే మంచి నీటి ముత్యాలు వంటిని తాకిన వెంటనే మనసులోని ఒత్తిడి నంతా చేతితో తీసినట్టు... ఓ అద్భుతమైన ఫీలింగ్. ఎక్సర్సైజ్లు కూడా అంతే. కాసేపు జిమ్‌లోనో, పార్కులోనో కసరత్తులు చేస్తూ గడిపితే మనసులోని చిరాకులు పరాకులు అన్నీ ఫటాఫట్. మరి ఇంత హాయినిచ్చే ఈ రెండిటినీ ఎంచక్కా జోడించేస్తే... ఒళ్ళంత తుళ్ళింత కల్గించే వాటర్నీ, వంటిని వంపులు తిప్పే వర్కవుట్లనీ జతచేసి... వాటర్వర్కవుట్స్ చేస్తే... డబుల్ మజా, డబుల్ పవర్ మన సొంతమవడం ఖాయం.
మండుతున్నట్టు, మంట పక్కనే ఉన్నట్టు ఎండలు. ఇలాంటి వేడి వాతావరణంలో చెమట్లు కక్కుతూ నాలుగ్గోడల మధ్య వ్యాయామాలు చేయా లంటే çసహజంగానే చాలా మంది వెనకాడుతుం టారు.అయితే వ్యాయామానికి వ్యాయామం, చల్లదనానికి చల్లదనం రెండూ ఉంటాయని ఈ సీజన్లో ఈతకు మాత్రం సై అంటారు. కేవలం స్విమ్మింగ్‌తో సరిపెట్టేయకుండా నీళ్ళలోనే ఉంటూ బోలెడన్ని వర్కవుట్లు చేయాలని ఆశించే వారికి మంచి మార్గం ఆక్వా ఎరోబిక్స్.
ఏమిటీ వాటర్ ఎరోబిక్స్?
నీళ్ళలో వర్కవుట్స్ చేయడం అనేది చాలా కాలం క్రితమే విదేశాల్లో మొదలైంది. దాదాపు ప్రతి రిసార్ట్, స్పా, క్లబ్‌లలో వీటికోసం అవసరమైన ఏర్పాట్లు ఉంటాయక్కడ. కొన్ని యూరప్ దేశాల్లో అయితే ఇవి ఓ ఉత్సవంలా సాగుతాయి. పూర్తి వినోదభరితంగా ఉంటాయి. రొటీ¯Œ కు భిన్నంగా, వ్యాయామానికి వినోదం జోడింపుగా ఈ వాటర్ వర్కవుట్స్ సాగు తాయి. దాదాపు కంఠం వరకూ నీళ్ళలో నిలబడి గాలిలోకి చేతులు జాపుతూ చేసే ఎరోబిక్స్, తక్కువ బరువుతో చేసే వెయిట్ ట్రయినింగ్, స్ట్రెచ్చింగ్... వంటివన్నీ ఇందులో భాగమే. వీటినన్నింటిని కలిపి ఆక్వా ఎరోబిక్స్గా వ్యవహరిస్తారు. విదేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వ్యాయామశైలి ఇప్పుడు మన మెట్రోలకూ విస్తృతంగానే విస్తరించింది... ఇంకా విస్తరిస్తోంది.
లాభాలివే...
నీళ్ళలో వ్యాయామం మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీటికి సాంద్రత ఎక్కువని తెల్సిందే. ఇది గాలికన్నా ఎక్కువగా దాదాపు 12 రెట్లు నిరోధక శక్తిని కోరుతుంది. నీళ్ళలో కదలికలు కాస్త కఠినంగా అన్పించడానికి కారణమిదే. దేహంలోని కేలరీలు ఎక్కువగా ఖర్చు అవడానికి కూడా ఇది దోహదం చేస్తుంది. తద్వారా మన బాడీ టోనింగ్కూ ఉపకరిస్తుంది. నేలమీద చేసే ఎరోబిక్స్‌లో గంట వర్కవుట్కు 250–400 కేలరీలు ఖర్చయితే వాటర్‌లో చేసే ఈ ఎరోబిక్స్కు కనీసం 650–700 కేలరీలు ఖర్చవుతాయి. మిగిలిన అన్ని రకాల ఎరోబిక్స్ వ్యాయామాలతో పోల్చినపుడు ఇది సురక్షితమైనది. ఆరోగ్యకరమైంది. బాడీమజిల్ని, బోన్స్ని, జాయింట్స్‌ని ఒత్తిడికి గురిచే యదు. ఎందుకంటే దాదాపు 90 శాతం దాకా మన బరువుకు నీటి సపోర్ట్ లభిస్తుంది.రన్నింగ్, లేదా మరే ఇతర ఫ్లోర్ ఎక్సర్సైజ్లు చేసేవారికి వచ్చే సమస్యలకు భిన్నంగా ఈ వ్యాయామాల వల్ల ఎటువంటి జాయింట్ ప్రాబ్లమ్స్ రావు. నిర్విరామంగా దేహం నీళ్ళలో నానుతూ చల్లబడుతూ ఉండడం వల్ల సహజంగా వర్కవుట్ల కారణంగా పుట్టే వేడి చెమట వంటి ఇతరత్రా ఇబ్బందులు కలగవు.
స్విమ్మింగ్ తెల్సి ఉండాలా?
ఆక్వా ఎరోబిక్స్ చేయడానికి స్విమ్మింగ్ తెల్సి ఉండనక్కర్లేదు. స్విమ్మర్స్ కాని వాళ్ళు కూడా చేయవచ్చు. అయితే స్విమ్‌సూట్ మాత్రం తప్పనిసరి. అదే విధంగా ఆక్వా షూస్, స్విమ్ క్యాప్స్ వంటివి కూడా అవసరం. నీళ్ళలో ఉండగా స్థిరత్వాన్ని అందించేందుకు షూస్ ఉపకరిస్తాయి. మీ తల వెంట్రుకలు ముఖంపై పడి ఇబ్బంది పెట్టకుండా క్యాప్స్ కావాలి.
వర్కవుట్స్ ఎలాంటివంటే..
బయట చేసే చాలా రకాల వర్కవుట్స్‌ని నీళ్ళలో కూడా చేయవచ్చు. నడవడం, రన్నింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్లు కూడా. జంపింగ్ జాక్స్ తరహా వ్యాయామాలు కూడా బావుంటాయి. దేహంలోని అన్ని మజిల్స్కూ ఇవి పని కల్పిస్తాయి. స్కైయింగ్ మోషన్ బ్యాక్, ఫోర్త్, లంగ్స్ ఇన్ ఛెస్ట్ డీప్ వాటర్, కిక్ బాక్సింగ్ మూవ్స్... వంటివి కూడా దీనిలో భాగంగా మార్చుకోవచ్చు.
పరికరాలున్నాయి...
ఈ వర్కవుట్ల కోసం ప్రత్యేకమైన పరికరాలు కూడా లభిస్తున్నాయి. బరువు తక్కువగా అన్పించే ఆక్వా డంబెల్స్ వీటిలో ఒకటి. ఈ డంబెల్స్‌తో బైసప్స్, ట్రైసప్స్, షోల్డర్స్‌కు నీళ్ళలో ఉండే వ్యాయామాలు చేయవచ్చు.ఇంకా నూడుల్స్ వంటి విభిన్న రకాల ఎక్విప్మెంట్ కూడా వినియోగించవచ్చు.
అవసరమైన వస్తువులు...
దాదాపు స్విమ్మింగ్‌కు అవసరమైన వన్నీ దీనికి కూడా అవసరమే. ఆక్వాబ్లాక్స్, ఫ్లోటేషన్ బెల్ట్స్, గ్లోవ్స్, కిక్బోర్ట్స్, ఆక్వాస్టెప్... వంటి వన్నీ కావాలి.
ఎవరికి లాభం?
వీటిని ప్రతిఒక్కరూ ప్రయత్నించవచ్చు. వయసుల కు లింగబేధాలకు అతీతంగా. క్రీడాకారులు, నృత్యక ళాకారులు, ఆరోగ్యార్ధులు, కొన్ని రకాల దీర్ఘకాలవ్యా« దులున్న వాళ్ళు, విభిన్న రకాల వ్యాయామాల పట్ల ఆసక్తి ప్రదర్శించేవారు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్దితుల వల్ల వ్యాయా మం చేయలేకపోతున్న వాళ్ళు... ఇలా అందరూ చేయదగ్గది. వారంలో 5 రోజులు చేస్తే చాలు.
జాగ్రత్తలివే
►ఒంటరిగా వీటిని చేయాలనుకోవద్దు. నీళ్ళలోకి దిగేటపుడు దానిలోతు గురించి ఖచ్చితంగా తెల్సుకోవాలి.
►నీళ్ళు చాలా లోతుగా ఉంటే బ్యాలెన్స్ కోల్పోవడం, సరైన శైలిని కూడా విడవడం జరుగుతుంది.
►వ్యాయామానికి ముందుగా వార్మప్, ముగిసిన తర్వాత కూల్డవున్ ఎక్సర్సైజ్లు తప్పనిసరిగా చేయాలి.
►వాతావరణం బాగా చల్లగా ఉన్నపుడు మరింత చల్లనినీటిలో చేయడం వద్దు. నిర్ణీతవేడి నీళ్ళలో ఉండేలా చూసుకోవాలి.
► వాటర్ వర్కవుట్లంటే నొప్పి కలగనివి. ఏదైనా ప్రత్యేకమైన వర్కవుట్ వల్ల ఇబ్బందులñ దురైతే చేయడం మానేయాలి.
►మీ పరిస్ధితి, సామర్ధ్యాలను బట్టి వ్యాయామాలలో వేగాన్ని నిర్ణయించుకోవాలి.
►నీళ్ళలో వర్కవుట్ కదా అని నీళ్ళు తాగడంలో నిర్లక్ష్యం వద్దు. ప్రారంభంలోనూ, ముగిసిన తర్వాత మీ అవసరాన్ని బట్టి నీళ్ళు తాగుతుండాలి.
►కొత్తగా ప్రారంభిస్తున్నపుడు వైద్యుల సలహా, పర్యవేక్షకుని సూచనలు తప్పనిసరి.
ఉపయోగాలెన్నో...
►యస్.సత్యబాబుటెంపరేచర్ కంట్రోల్ ఉన్న స్విమ్మింగ్‌ఫూల్ ఈ వాటర్ వర్కవుట్స్‌కు అనుకూలం.
► అన్నిరకాల ‘కార్డియో’వ్యాయామాలు నీళ్ళలో చేయవచ్చు.
►వాకింగ్ వంటి తేలికపాటి ఎక్సర్‌సైజ్‌తో ప్రారంభించాలి.
►మాయిశ్చరైజర్, వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్లను వాడాలి.
►నేలపైచేసే ఎక్సర్‌సైజ్‌లతో పోల్చితే వాటర్వర్కవుట్స్లో హార్ట్‌రేట్ తక్కువగా ఉంటుంది. కానీ లాభాలు మాత్రం ఎక్కువ.
– యస్.సత్యబాబు
తక్కువ బరువుండే ఆక్వా డంబెల్స్‌ను ఉపయోగించి చేసే వర్కవుట్స్‌ను ప్రారంభించాలిలా
డంబెల్స్‌తో చేసేపుడు లోతు తక్కువగా ఉన్న చోటు ఎంచుకుని చేయాలి.
నీళ్ళ నిరోధకశక్తిని ఎదుర్కుంటూ చేతుల్ని నలువైపులా తిప్పుతూ చేసే వర్కవుట్ ఇది.
వంటికి తగిలించుకునే ఆక్వా న్యూడుల్స్ కూడా ఈ ఎక్సర్సైజ్లకు ప్రత్యేకం.
నీళ్ళలో నిదానంగా తేలుతూ కూడా వర్కవుట్స్ చేయడానికి న్యూడుల్స్ ఉపకరిస్తాయి.
స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయడం అంటే ఆరోగ్యాన్ని ఆహ్వానించ డమే. అదే నీటిలో అయితే ఆనందాన్ని ఆస్వాదించడం కూడా.