జోరు వాన
కరీంనగర్: జిల్లాలో శుక్ర, శనివారాల్లో జోరు వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఇక బతుకమ్మ పండుగకు వర్షం అడ్డంకి మారింది. జగిత్యాల పట్టణంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. జగిత్యాల, సారంగాపూర్ మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. బీర్పూర్ గ్రామానికి చెందిన అల్లె మల్లేశానికి చెందిన ఇల్లు కూలిపోయింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముస్తాబాద్–సిద్దిపేట కల్వర్టు వద్ద నీటి ప్రవాహం పెరగడంతో ఇసుకతో నింపిన సంచులను అడ్డుగా వేశారు. ఆవునూర్, గూడెం గ్రామాల్లో కోతకు వచ్చిన వరిపంట నీట మునిగింది. సిరిసిల్ల మండలం అంకిరెడ్డిపల్లి–ఓబులాపూర్ మధ్య నూతనంగా వేస్తున్న రోడ్డు వర్షానికి దెబ్బతింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో పిడుగు పడింది. దీంతో పదిఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు, సెల్ఫోన్లు చెడిపోయాయి. మంథని మండలంలోని గోపాల్పూల్, చిన్నఓదాల, బిట్టుపల్లి, ధర్మారంలో వరిపంట నీట మునిగింది. ముత్తారం మండలం శుక్రవారంపేట, సర్వారంలో 30 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. మహాముత్తారం మండలంలో దౌతుపల్లి వద్ద గల లోలెవల్కాజ్వె, నిమ్మగూడెం పెద్దవాగులు పొంగిపోర్లాయి. దీంతో శనివారం మండల కేంద్రానికి రావాల్సిన అటవీ గ్రామాలైన కనుకునూర్, పెగడపల్లి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చొప్పదండి మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల వరిపంట నేలకొరిగింది.