ప్రజాప్రతినిధులపై దాడులా..?
నెల్లూరు (సెంట్రల్): టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పోలీసుల తీరు దారుణంగా తయారైందని, చంద్రబాబు కోసమే పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని 52వ డివిజన్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులపై గురువారం పోలీసుల తీరు భయభ్రాంతులకు గురిచేసేలా ఉందన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ శుక్రవారం ఆయన ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు లేఖ రాశారు.
‘అసలు ఏం జరుగుతోంది..ప్రజాస్వామ్యంలో ఉన్నామా’ అని ప్రశ్నించారు. కొందరి తీరు పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటుగా ఉందన్నారు. ప్రజల తీర్పును బట్టి ప్రభుత్వాలు మారుతుంటాయని, అధికారులు మాత్రం నిజాయితీగా వ్యవహరించాలన్నారు. కింది స్థాయి అధికారుల తీరు సరిగా లేదని, టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.
గురువారం రంగనాయకులపేటలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ వెంట వెళ్లిన కార్పొరేటర్లతో ఇన్ స్పెక్టర్ వెంకటరత్నం అమానుషంగా వ్యవహరించారన్నారు. అక్కడ ఎలాంటి గొడవ జరగకపోయినా ఇన్స్పెక్టర్ రెచ్చగొట్టి గందరగోళం సృష్టించారన్నారు. కార్పొరేటర్లు అనే గౌర వం లేకుండా దుర్బాషలాడుతూ చొక్కా లు పట్టుకుని ఈడ్చుకెళ్లారన్నారు. ఆయన తన హోదాను మరిచి టీడీపీకి దాసోహమైనట్టు వ్యవహరించడం అభ్యంతరకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
అధికార పార్టీ నేతల
అండతో జులుం
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతల అండతో పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఏ తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు మీద పోలీసులకు అంత ప్రేమ ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవాలంటూ ఘాటుగా స్పందించారు.
ఎస్పీగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు మంచి పేరు తెచ్చిపెట్టాయని, కింది స్థాయి అధికారుల తీరు మాత్రం పోలీసు శాఖకు చెడ్డపేరు తెస్తోందన్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరారు. టీడీపీ అధికారం చేపట్టినప్పటికి ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్‌ను గెలిపించి ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. అధికార పార్టీ అండతో పెడుతున్న అక్రమ కేసులు, చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టి న్యాయాన్ని రక్షించకపోతే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు.