రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం
కురబలకోట, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వమని, అందుకోసం సైనికుల్లా ముందుకుసాగుతామని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రతిజ్ఞచేశారు. కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో మంగళవారం అరలక్ష జనగర్జన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జేఏసీ కన్వీనర్ సురేంద్రబాబు మాట్లాడుతూ ప్రజాభీష్టం లేకుండా రాష్ట్ర విభజనకు పాల్పడ్డ నాయకులు నాశనమై పోతారన్నారు. గోల్డన్‌వ్యాలీ రమణారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగపరంగా ఏర్పడిన రాష్ట్రాన్ని రాజకీయంగా విభజన చేయడానికి సోనియా ఎవరన్నారు. బీటీ కళాశాల మాజీ వైస్ ప్రిన్సిపాల్ ఆర్ సుబ్బరామయ్య మాట్లాడుతూ హైదరాబాదును తెలంగాణకు ఇస్తే వండిపెట్టిన అన్నాన్ని కుక్క ఎత్తికెళ్లినట్లే అవుతుందని పేర్కొన్నారు.
మిట్స్ ప్రిన్సిపాల్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటే మనకంతా బలమన్నారు. విశ్వం ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్రే కాదు తెలుగు జాతి నష్టపోతుందన్నారు. వివేకానంద హైస్కూల్ బయ్యారెడ్డి మాట్లాడుతూ దుష్టశక్తుల భరతం పట్టడానికి అందరూ సింహాలై గర్జించాలన్నారు. మాజీ సర్పంచ్ కె ప్రసాదరావు మాట్లాడుతూ జనోద్యమంలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్వో రామయ్య మాట్లాడుతూ జనం ఉద్యమంలో ఉంటే సీమాంధ్ర మంత్రులు రాజీనామాలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఎంపీడీఓ గంగయ్య మాట్లాడుతూ ఇటలీ సోనియా ముందు వీళ్లు మోకరించడం నీచమన్నారు. ట్రాన్స్‌కో ఏఈ డేవిడ్ మాట్లాడుతూ విభజనతో నిరుద్యోగం తాండవిస్తుందన్నారు.
ఏఈ మునిరాజ మాట్లాడుతూ ఇలాంటి ఉద్యమాలతో ఢిల్లీ దిమ్మతిరగాలన్నారు. జేఏసీ నాయకులు వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంద్ర సాధించేవరకు ఉద్యోగాలను కూడా వదిలి ఉద్యమాన్ని సాగిస్తామన్నారు. కుట్రదారులను తిప్పికొట్టి సమైక్యాన్ని కాపాడుకోవాలని అంగళ్లు ఇన్చార్జి సర్పంచ్ బి దస్తగిరి అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నేత చంద్రశేఖర్, మిట్స్ రవి, ఎంఈవో త్యాగరాజు, సతీష్‌రెడ్డి, ఫజరుల్లా, రహమాన్, గిరి, సుబ్బారావు, జయకుమార్, ముబారక్ పాల్గొన్నారు.