నియంతృత్వం ఇప్పుడు అసాధ్యం!
నాడున్నది బలహీన వ్యవస్థలు.. నేడవన్నీ బలోపేతమయ్యాయి
* ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 19 నెలలు జైల్లో గడిపా
* ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఎమర్జెన్సీ జ్ఞాపకాలు
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రజాస్వామ్య భారతదేశాన్ని నియంతృత్వ పాలనవైపు తీసుకువెళ్లడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థ, మీడియా, పోలీసులు, అధికార వర్గం అప్పుడు బలహీనంగా ఉన్నాయని.. ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు.
రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చడం సాధ్యమవుతుందని.. అలాంటి పరిస్థితుల్లో మీడియా, న్యాయవ్యవస్థ సహా అన్ని వ్యవస్థలు కుప్పకూలుతాయని ఎమర్జెన్సీ రుజువు చేసిందని పేర్కొన్నారు. విద్యార్థి నేతగా 1975 నాటి అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించి 19 నెలల పాటు జైల్లో గడిపిన జైట్లీ.. నాటి జ్ఞాపకాలను బుధవారం పీటీఐతో పంచుకున్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..
♦ 40 ఏళ్ల క్రితం నాటి ప్రధాని ఇందిర దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు మీడియా దుర్బలంగా ఉంది. పోలీసులు, అధికారులు కీలుబొమ్మలు. సుప్రీంకోర్టుకు కూడా ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ఆ పరిస్థితిని మళ్లీ పునఃసృష్టించడం సాధ్యమా? నాకైతే అనుమానమే.
♦ ఎమర్జెన్సీ సమయంలోనే నేను ఢిల్లీ వర్సిటీలో విద్యార్థి నేతను. 1975, జూన్ 25 రాత్రి పోలీసులు నన్ను అరెస్ట్ చేసేందుకు మా ఇంటికి వచ్చారు. మా నాన్న వారితో మాట్లాడుతుండగానే నేను తప్పించుకుని ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లాను. ఆ మర్నాడు నిరసన ప్రదర్శన నిర్వహించాం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిర్వహించిన మొదటి ధర్నా అది. అక్కడే నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాపై మీసా కింద కేసు పెట్టారు. 19 నెలలు జైల్లో ఉన్నాను.
♦ ఆ సమయంలో వేలాది మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు. లక్షలాది మందిపై డిటెన్షన్ ఆర్డర్లు జారీ అయ్యాయి. అక్రమ కేసులు పెట్టబోమని ఏ ఒక్క పోలీసు, అక్రమంగా డిటెన్షన్ ఆర్డర్లు ఇవ్వబోమని ఏ ఒక్క కలెక్టరు ధైర్యంగా చెప్పలేని పరిస్థితి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద స్టేట్స్‌మేన్ మినహా పత్రికలన్నీ నియంతృత్వానికి దాసోహమన్నాయి.