మాస్టారూ.. జీతాల్లేవ్..!
బదిలీ అయిన టీచర్లకు వేతనాలు నిలిపివేత
నవంబర్ నెలకు చెల్లించవద్దని ఖజానా శాఖ డెరైక్టర్ ఆదేశాలు
ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బదిలీలు నిర్వహించడంతోనే ఈ పరిస్థితి
ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ నిలిపివేత
జిల్లాలో మొత్తం 11 వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం
గుంటూరు ఎడ్యుకేషన్ ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. బదిలీ కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఎట్టకేలకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ పొందిన ఉపాధ్యాయుల ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. గత నెలలో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా బదిలీపై ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించవద్దని ఖజానా శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ఫలితంగా డిసెంబర్ 1వ తేదీన వేతనాలు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది.
1,916 మంది ఉపాధ్యాయుల బదిలీ ...
ఈ ప్రభావం బదిలీ అయిన ఉపాధ్యాయులతో పాటు ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులపైనా పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు వెబ్ ఆధారిత బదిలీలను నిర్వహించేందుకు ఆగస్టు 31న పాఠశాల విద్యాశాఖ జీవో 63 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో జిల్లాలో దరఖాస్తు చేసిన 4,700 మంది ఉపాధ్యాయుల్లో 1,916 బదిలీ అయ్యారు. నవంబర్ 1న కొత్త పాఠశాలల్లో చేరారు.
11 వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం ....
ఆర్థికశాఖ అనుమతి లేకుండా విద్యాశాఖ నేరుగా బదిలీలు నిర్వహించినందున ఉపాధ్యాయులకు నవంబర్ నెల వేతనం చెల్లించవద్దని ఖజానా శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 10 తేదీన ఉపాధ్యాయులకు వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. జిల్లాలో బదిలీ అయిన 1,916 మందితో పాటు వారు పని చేస్తున్న పాఠశాలల్లోని ఇతర ఉపాధ్యాయుల వేతన బిల్లులూ నిలిచిపోనున్నాయి. జిల్లాలో జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న 11 వేల మంది ఉపాధ్యాయులపై ఈ ప్రభావం పడనుంది.
ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చే వరకు ....
మండలాన్ని యూనిట్‌గా తీసుకుని పాఠశాలల వారీగా ఉపాధ్యాయుల వేతన బిల్లుల చెల్లింపులు జరుపుతున్న పరిస్థితుల్లో, వేతన బిల్లులన్నింటినీ గత నెల 25 తేదీ నాటికే ట్రెజరీలకు పంపివేశారు. ఖజానా శాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో బదిలీ అయిన ఉపాధ్యాయుల వరకు వేతనాలు నిలిపివేయం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ వేతన చెల్లింపులు నిలిపివేస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చే వరకు వేతన చెల్లింపులు జరగని పరిస్థితుల్లో ప్రభుత్వ తీరును ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం ముం దు చూపులేని వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని విమర్శిస్తున్నారు.