website notification
-
'ప్రభుత్వ జీవోలను వెబ్సైట్లలో ఉంచాలి'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలందరూ చూసే విధంగా ప్రభుత్వ అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పేరాల శేఖర్ అనే వ్యక్తి ఈ మేరకు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఇప్పటివరకూ లక్షకుపైగా జీవోలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయగా అందులో 42,500 జీవోలను వెబ్సైట్లలో పొందుపరచలేదని ఆయన తన పిటిషన్లో తెలిపారు. ఈ క్రమంలో బుధవారం పిటిషన్‌ను విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
కోర్సులేకున్నా పోస్టింగులు
జిల్లాలో కీలక నేత సిఫార్సే అర్హత ఏయూ పెద్దల నిర్వాకం ఇదీ దూరవిద్యావిభాగంలో అస్మదీయులకు అందలం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వడ్డించేవాడు మనవాడైతే చివరిపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్నట్లుగా ఉంది ఏయూలో పోస్టిం గుల తీరు. పెద్దలు మనవాళ్తై కోర్సులు లేకపోయినా పోస్టులు మాత్రం కట్టబెట్టేస్తున్నారు. మంత్రివర్యుల సిఫార్సు... ఏయూ పెద్దల సపోర్టు ఉంటే ఇంకేం... పోస్టుల భర్తీ అన్నది పూర్తి ఫార్సుగా తయారైపోతోంది. ఏయూ దూరవిద్యా విభాగం కేంద్రంగా అస్మదీయులకు యథేచ్ఛగా పోస్టుల పందేరం సాగుతున్న తీరు ఇదిగో ఇలా ఉంది...జిల్లాలో చక్రం తిప్పుతున్న ఓ ప్రభుత్వ పెద్ద అనుగ్రహానికి పాత్రులు కావడమే ఏయూ పెద్దల లక్ష్యంగా మారింది. గతంలోఅడ్డగోలుగా మూడు పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ జరిపించింది. అయినా వ్యవహారం మాత్రం తేలలేదు. కేవలం ఏయూ పెద్దలను తన దారికి తెచ్చుకునేందుకే సదరు పెద్ద ఈ వ్యవహారాన్ని వాడుకున్నారని తేటతెల్లమైంది. తరువాత ఆయన చెప్పిందే ఏయూలో వేదంగా మారింది. ఆ నివేదికను బూచిగా చూపి అస్మదీయులతో ఏయూను నింపేస్తున్నారు. తాజాగా ఆ ప్రభుత్వ పెద్ద తనవారికి ఏయూలో పోస్టులు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. కోర్సు లేకపోయినా! ప్రభుత్వ పెద్ద సిఫార్సుతో ఏయూ పెద్దలు తర్జనభర్జన పడ్డారు. ఎందుకంటే ఆయన సిఫార్సు చేసిన అభ్యర్థి సబ్జెక్ట్ జాగ్రఫీ. ప్రస్తుతం జాగ్రఫీ విభాగంలో ఖాళీలు లేవు. దాంతో ఏయూ పెద్దలు మరో ఎత్తుగడ వేశారు. దూరవిద్యావిభాగంలో ఆయన్ని కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు. కాకపోతే అందుకోసం వెబ్సైట్లోనోటిఫికేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహించి కాస్త పద్దతిగానే హడావుడి చేశారు. కానీ అసలు కోర్సే లేని సబ్జెక్ట్‌కు అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను ఎందుకు నియమించారన్నది అంతుచిక్కకుండా ఉంది. ఈ నియామకంతోవిద్యార్థులకు ఉపయోగం లేదు. పైగా ఏయూకు ఆర్థిక భారం. గతంలో కూడా! జాగ్రఫీలోనేకాదు కొన్ని నెలల క్రితం సోషల్‌వర్క్ విభాగంలో కూడా కాంట్రాక్టు విధానంలో ఓ మహిళను అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించారు. ఆమె సర్వీసును రెన్యువల్ కూడా చేశారు. ఇలా కోర్సులు లేకపోయినా పోస్టింగులు కట్టబెడుతున్నవారికి ఇతరత్రా పనులకు ఉపయోగించుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు పీజీ కోర్సులకు ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఆ కోర్సులు లేవు. దాంతో వారిని అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకనో మరోదానికనో ఉపయోగించుకోవాలన్నది ఏయూ పెద్దల ఉద్దేశం. ముందు ఉద్యోగం ఇచ్చేసి ... తరువాత ఏదో బాధ్యత అప్పగిస్తారు. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు వాడుకుంటాం: రిజిస్ట్రార్ ఈ వ్యవహారంపై ఏయూ రిజిస్ట్రార్ కె.రామ్మోహన్‌రావును ‘సాక్షి’ సంప్రదించగా కోర్సులు లేకపోయినప్పటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిన విషయాన్ని ధ్రువీకరించారు. వారిని దూర విద్యావిభాగంలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పనుల్లో ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు.