wedding bus
-
బూడిదైన పెళ్లి బస్సు
మండ్య: బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్తున్న పెళ్లి బస్సు మండ్య జిల్లా శ్రీరంగ పట్టణం వద్ద మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. బస్సులోని వారందరూ దిగిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు.. మైసూరు నగరంలో ఉన్న రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగే పెళ్లికి వధువు కుటుంబం, బంధువులు కలిసి బెంగళూరు నుంచి బయల్దేరారు. జాతీయ రహదారిపై శ్రీరంగ పట్టణం తాలూకా గణంగూరు వద్ద బస్సు వెనుక చక్రానికి రాయి తగిలి పెద్ద శబ్ధం వచ్చింది. వెంటనే బస్సు డ్రైవర్ బస్సు నిలిపి చూడగా పొగలు వస్తుండగా బస్సులో ఉన్నవారిని అందరినీ దిగిపోవాలని చెప్పాడు. కొన్ని క్షణాల్లోనే మంటలు అంటుకుని బస్సు మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసేటప్పటికి బస్సు మొత్తం కాలి బూడిదైంది. ప్రయాణికుల లగేజి కొంతభాగం కాలిపోయింది. -
బురద నీటిలో పెళ్లి బస్సు!.. రాత్రంతా అక్కడే ఉండటంతో
సాక్షి, వికారాబాద్: పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న బస్సు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బురద నీటిలో ఇరుక్కుపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం బర్వాద్ గ్రామానికి చెందిన పెళ్లి బృందం వారు హైదరాబాద్లోని బోరబండకు వెళ్లారు. వివాహం ముగిసిన తర్వాత తిరుగుప్రయాణంలో రాత్రి 11గంటలకు మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. వంతెన కింది నుంచి బస్సు తీసుకెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అప్పటికే భారీ వర్షం కువరడంతో బ్రిడ్జి కింద వరద చేరింది. బస్సు టైర్లు బురదలో కూరుకుపోవడంతో ముందుకు కదలలేదు. దీంతో వాహనం దిగిన పెళ్లివారు నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. అక్కడి నుంచి ఆటోల్లో ఇళ్లకు చేరుకున్నారు. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో బస్సును అలాగే వదిలేశాడు. తెల్లారేసరికి మరింత వర్షం కురవడం, ఊట నీరు సైతం బ్రిడ్జి కిందకు చేరడంతో సగ భాగానికి పైగా బస్సు నీటిలో మునిగిపోయింది. ఉదయాన్నే అక్కడకు చేరుకున్న బస్సు యజమాని, డ్రైవర్, క్లీనర్, గ్రామస్తుల సాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గతేడాది సైతం ఇవే కష్టాలు గతేడాది వర్షాకాలంలోనూ మొరంగపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. ఈ రూట్లో నాలుగైదు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. వీరికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం బ్రిడ్జి పనులైనా వేగంగా పూర్తిచేయడం లేదు. వంతెన కింద వరద నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనిపించని హెచ్చరిక బోర్డులు వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న చోట హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలేదు. ఈ విషయాన్ని అటు కాంట్రాక్టర్ ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో కొత్తగా ఎవరైనా ఈ రూట్లో వస్తే ప్రమాదం బారిన పడక తప్పదు. గత వర్షా కాలంలో ఇక్కడే ఇరుక్కుపోయిన ఓ లారీ మూడు రోజులుగా అక్కడి ఉండిపోయింది. -
పెళ్లి బస్సులో మంటలు
భువనగిరిఅర్బన్ : హైదరాబాద్ నుంచి భువనగిరికి వస్తున్న పెళ్లి బస్సులో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన ఆదివారం భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరిలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఓ వివాహనికి హైదరాబాద్ నుంచి కొంతమందితో పెళ్లిబస్సు భువనగిరికి చేరుకుంది. స్థానిక జగదేవ్పూర్ చౌరస్తా వద్దకు రాగానే బస్సుకు చెందిన వెనుక టైర్ల నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు దిగారు. డ్రైవర్, క్లీనర్ వెంటనే టైర్ల నుంచి పొగలు వస్తున్న ప్రాంతంలో నీటిని పోసి చల్లార్చారు. అనంతరం బస్సుకు మరమ్మతులు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
పెళ్లి బస్సుకు ప్రమాదం:15 మందికి గాయాలు
వేగంగా వెళ్తున్న పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తనపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి పుత్తూరుకు వెళ్తున్నబస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది గాయాలపాలయ్యారు. వారందరినీ తిరుపతి రుయాకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.