వివాహాల్లో కట్నకానుకలు ఇక అవేనట!
హైదరాబాద్ : ఏదైనా శుభకార్యానికి కానీ, పెళ్లి వేడుకలకు కానీ వెళ్లేటప్పుడు కట్నకానుకలుగా ఏం సమర్పించాలా.. తెగ తర్జనభర్జన పడుతుంటారు. ఇప్పుడు ఆ అవసరమే లేదు. పెద్దనోట్ల రద్దుతో పెళ్లి వేడుకలకు ఏదైనా కొని తీసుకెళ్దామన్నా.. కానుకలుగా సమర్పిద్దామన్నా సరిపడ నగదు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఆలోచించకుండా పెళ్లి కొడుకు, కూతురికి కట్నకానుకలుగా బ్యాంకు చెక్‌లను, పాతనోట్లనే ఇస్తున్నారట. తర్వాత రోజు కట్నకానుకలు చూసుకుంటున్న పెళ్లికొడుకు కుటుంబసభ్యులకు డజన్ల కొద్దీ చెక్స్, రద్దుచేసిన పాత రూ.500 నోట్లు, రూ.1000నోట్లే గిప్ట్‌లుగా దర్శనమిస్తున్నాయట.
వచ్చేవారం జరుగబోయే తన మేనకోడలు వివాహానికి ఏదైనా కొందామని మార్కెట్ వెళ్లిన తనకు ప్రతికూలతే ఏర్పడినట్టు నగరానికి చెందిన పొలిశెట్టి చిత్తరంజన్ అనే వ్యక్తి చెప్పాడు. కొంతమంది ట్రేడర్స్ మాత్రమే చెక్స్‌ను ఆమోదిస్తున్నారని, చాలామంది నగదునే అడుగుతున్నారని తెలిపాడు. కేవలం పెద్ద దుకాణాలు మాత్రమే డెబిట్, క్రెడిట్ కార్డులు ఆమోదిస్తున్నాయని, కానీ పెళ్లిళ్లో కావాల్సిన చిన్నచిన్న వస్తువుల కోసం కచ్చితంగా నగదు అవసరం పడుతుందని పేర్కొన్నాడు. కొన్ని ఫంక్షన్స్‌లో గతిలేక పాతనోట్లనే కానుకులుగా సమర్పించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. పాత నోట్ల రద్దుతో, కొత్తనోట్ల లేకపోవడంతో వినియోగదారులను కోల్పోలేక తప్పనిసరి పరిస్థితుల్లో చెక్స్‌ను అంగీకరించాల్సి వస్తుందని కొంతమంది వ్యాపారస్తులు చెబుతున్నారు. వాటిని మార్చుకుని, నగదును తీసుకోవడానికీ తెగ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.