వెయిట్ లిఫ్టింగ్‌లో మారిన పతకాలు
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలిచిన తెలుగు తేజం మత్స సంతోషి (53 కేజీలు)కి పతకం మారింది. ఆమెకు రజత పతకం దక్కింది. అంతకుముందు ఆమె కాంస్య పతకం నెగ్గింది. స్వర్ణం సాధించిన నైజీరియన్ వెయిట్ లిఫ్టర్ చికా అమలాహా డోపింగ్‌లో విఫలం కావడంతో ఆమె నుంచి పతకం వెనక్కు తీసుకున్నారు. దీంతో కాంస్యం నెగ్గిన సంతోషికి రజత పతకం ఇచ్చారు.
నాలుగో స్థానంలో నిలిచిన మరో భారత లిఫ్టర్ స్వాతి సింగ్ కు కాంస్య పతకం అందజేశారు. దీనిపై తమకు అధికారిక సమాచారం అందిందని భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సహదేవ్ యాదవ్ తెలిపారు. దీంతో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 3 బంగారు, నాలుగు రజతం, ఐదు కాంస్య పతకాలున్నాయి.