మోదీకి సినిమా స్టార్లా స్వాగతం: పాక్ మీడియా
భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యర్థులను కూడా తలదన్నేలా ఉంటున్నారని పాక్ మీడియా శ్లాఘించింది. ఆయనకు అమెరికాలో ఒక సినిమా నటుడి స్థాయిలో స్వాగతం లభించిందని పేర్కొంది. పాకిస్థాన్‌లోని పలు పత్రికలు నరేంద్రమోదీ అమెరికా పర్యటన విశేషాలను విస్తృతంగా కవర్ చేశాయి. మోదీకి సినిమా స్టార్లా స్వాగతం లభించగా, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మాత్రం కేవలం ఐక్యరాజ్య సమితిలో మాత్రమే మాట్లాడే అవకాశం లభించిందని ద నేషన్ పత్రిక చెప్పింది.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, మోదీకి ఫేస్బుక్, గూగుల్ తదితర సంస్థల ప్రధాన కార్యాలయాలతో పాటు.. ఎన్నారైల నుంచి కూడా అద్భుతమైన స్వాగతం లభించింది. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు జనం చప్పట్లతో అభినందనలు వెల్లువెత్తించారు. మోదీ సిలికాన్ వ్యాలీలోని దిగ్గజాలను కలవడంతో పాటు ఫేస్బుక్ లాంటి సంస్థలకు కూడా వెళ్లి అక్కడ మార్క్ జుకెర్బెర్గ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారంటూ పాక్ మీడియా చెప్పింది.