దళారీ వ్యవస్థకు చెక్ పడేనా?
ఒంగోలు టూటౌన్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బజార్లు దళారులకు అడ్డగా మారాయి. రైతుల పేరుతో కార్డులు పొంది అక్రమాలకు పాల్పడుతున్నారు. అర్హులైన రైతులకు రైతుబజార్లో చోటు దక్కడం గగనంగా మారింది. జిల్లాలో పండించిన కూరగాయలను రైతులు ఇక్కడే అమ్ముకునే విధంగా చర్య లు తీసుకోవాలన్న లక్ష్యంతో 1999లో అప్పటి ప్రభుత్వం జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు చీరాల, తదితర ప్రాంతాల్లో రైతు బజార్లను ఏర్పాటు చేసింది.
కందుకూరులో 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఒక్క ఒంగోలులోనే కొత్తపట్నం బస్టాండ్, లాయర్పేట, సీతారామపురం ప్రాంతాల్లో రైతు బజార్లు ప్రారంభించారు. చీరాలలో రైతు బజారు మూతపడి చాలకాలమైంది. తిరిగి ప్రారంభించే చర్యలను అధికారులు తీసుకోలేకపోయా రు. ప్రారంభంలో రైతు బజార్లలో చోటు దక్కించుకునేందుకు రాజకీయ పైరవీలు రాజ్యమేలాయి. అప్పట్లో పలుకుబడి ఉన్న వారికే షాపు దక్కింది. అర్హులైన రైతులకు నిరాశే ఎదురైంది. అప్పటి నుం చి ప్రభుత్వాలు మారుతున్నా రైతు బజార్లను పట్టించుకున్న వారు లేరు. రైతుబజార్లను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పర్యవేక్షిస్తోంది.
ప్రస్తుతం రాష్ర్టం విడిపోయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతు బజార్ వారోత్సవాలకు తెరలేపింది. ఈ నెల 11న సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ కె.యాకూబ్నాయక్ తన చాంబర్లో రైతు బజార్ వారోత్సవాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, వ్యవసాయమార్కెటింగ్ శాఖ అధికారు లు పాల్గొన్నారు. రైతు బజార్లలో దళారులను గుర్తించి అధికారులు పేర్కొంటున్నారు. సోమవారం నుంచి వరుసగా ఐదు రోజు ల పాటు వారోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు లాయర్పేట రైతుబజార్లో వారోత్సవాలు ప్రారంభిస్తారు.
17వ తేదీ పచ్చదనం-పారిశుధ్యం, 18న కూరగాయలు పండించే రైతులకు యాజ మాన్య పద్ధతులు, గ్రేడింగ్పై శిక్షణ, 19న సంచార రైతు బజార్లు, 20న రైతు బజార్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా దళారీ వ్యవస్థను నిర్మూలించి అర్హులైన రైతులకు అవకాశం కల్పిస్తారో లేదోనన్న సందేహం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే 15 ఏళ్లుగా తిష్టవేసిన దళారులను ఒక్కసారిగా తొలగిం చడం సాధ్యమయ్యే పనేనా.. అంటూ మరికొందరు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ప్రతి రైతుబజార్లో 10 నుంచి 15 షాపుల వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎవరికీ కేటాయించలేదు. వారోత్సవాలతోనైనా రైతు బజార్లను ప్రక్షాళనా చేసి అర్హులకు అవకాశం కల్పిస్తారో లేదో వేచిచూడాలి.