టాటా పవర్ రూ. 10 వేల కోట్ల భారీ డీల్
రూ.10వేల కోట్ల భారీ డీల్
న్యూఢిల్లీ : వెల్స్ పన్ ఎనర్జీ రెన్యూవబుల్స్ ఆస్తులను టాటా పవర్ భారీ డీల్‌కు చేజిక్కించుకుంది. దాదాపు రూ.10 వేల కోట్లకు గ్రీన్ ఎనర్జీలో వెల్స్పన్ ఆస్తులను కొనుగోలు చేసింది. ఆదివారం రాత్రి ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఓ ప్రకటనలో తెలిపింది. షేర్ కొనుగోలు ఒప్పందంపై వెల్స్పన్ రెన్యూవబుల్ ఎనర్జీల 1.1 జీడబ్ల్యూ రెన్యూవబుల్ పోర్ట్ ఫోలియోను కొనుగోలు చేసినట్టు తెలిపింది. విలీనం, కొనుగోలు ఒప్పందాల్లో దేశంలో జరిగిన అతి పెద్ద ఒప్పందం ఇదేనని ప్రకటించింది. దేశంతో పాటు ఆసియాలోనూ ఇదే అతి పెద్ద డీల్ అని పేర్కొంది.
వెల్స్పన్ ఎనర్జీలో వెల్స్పన్ రెన్యూవబుల్స్ 100 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. 1,140 మెగా వాట్ ల రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులను ఈ కంపెనీ కలిగిఉంది. వాటిలో 990 మెగావాట్ల సోలార్ పవర్ కూడా ఉంది. దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్స్ గా ఇవి పేరు తెచ్చుకున్నాయి. 150 మెగా వాట్ల విండ్ పవర్‌ను దేశం మొత్తం మీద పది రాష్ట్రాల్లో విస్తరించాయి. అయితే ఈ ఒప్పంద ఫైనాన్షియల్ వివరాలను బయటకు పొక్కనీయలేదు. కేవలం రూ.10 వేల కోట్లకు మాత్రమే కొనుగోలు చేసినట్టు ప్రకటించాయి. ఈక్విటీ కాంపొనెంట్ కింద రూ. 3,650 కోట్లను టాటా పవర్ చెల్లించనుంది. మిగతా బాకీని రుణదాతల సమ్మతితో రీఫైనాన్స్ చేయాలని టాటా పవర్ చూస్తోంది.