గోచీ పెట్టుకు తిరగండి
గోవా మంత్రికి ప్రముఖ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ లేఖ
పణజి: బీచుల్లో మహిళలు కురచ దుస్తులు, బికినీలు ధరించి సంచరించడం వంటివి నిషేధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోవా పీడబ్ల్యుడీ మంత్రి సుదిన్ ధవళికర్పై విమర్శల జడి చుట్టుముట్టింది. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని, మిరపకాయలు, టమోటా, బంగాళ దుంపలు వంటివాటిని వినియోగించరాదని, కుర్చీలు, బల్లలపై కూర్చుని పని చేయడాన్ని నిషేధించాలని దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ ఘాటు లేఖ రాశారు.
లేఖలో ఎక్కడా మంత్రి పేరును పేర్కొనపోయినప్పటికీ మంత్రి వ్యాఖ్యలను వెన్‌డెల్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మంత్రి వ్యాఖ్యలు అభివృద్ధి నిరోధకంగాను ఉన్నాయన్నారు. ప్రస్తుతం ధరిస్తున్న చొక్కా యూరోపియన్దని, పాంట్స్, ఫైజమాలు చైనా, మధ్య ఆసియాలవని, సాక్స్, టీ-షర్టు, బినియన్లు, లోదుస్తులు సహా యూరప్‌లో కనిపెట్టారని ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతివి కాబట్టి వీటిని విడిచిపెట్టి భారతీయ సంస్కృతి అయిన శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా? అని లేఖలో ప్రశ్నించారు.