కన్నకూతుర్నే అతికిరాతకంగా హతమార్చింది
ఆస్తి తగదాలే కారణం
చిన్నకూతుళ్లతో కలిసి దారుణం
బంజారాహిల్స్: పేగు బంధాన్ని మరిచిన తల్లి ఆస్తి కోసం కన్నకూతుర్నే అతికిరాతకంగా పొడిచి చంపింది. ఇందుకు ఆమె చిన్నకూతుర్ల సహాయం తీసుకోవడం గమనార్హం. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... యూసఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే శ్వేత కళ్యాణి(29) శ్రీకృష్ణానగర్‌లోని బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది. ఆమె తల్లి సిద్ధాంతం సాయిలక్ష్మి (45), చెల్లెల్లు దివ్యజ్యోతి (25), విజయలక్ష్మి(21)లు వెంకటగిరిలో ఉంటున్నారు.
అందరూ కలిసి ఎల్‌ఎన్‌నగర్‌లో ఐదేళ్ల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిని కళ్యాణి ఒక్కతే అ నుభవిస్తూ తమకు అద్దె కూడా రాకుండా చేస్తోందని తల్లి, సోదరులు కొన్నేళ్లుగా ఘర్షణ పడుతున్నారు. ఇదిలా ఉండగా.. తల్లి సాయిలక్ష్మి తనతో వ్యభిచా రం చేయిస్తోందని కళ్యాణి గతంలో కేసు పెట్టగా పోలీసులు తల్లిని రిమాండ్‌కు తరలించారు. సాయిలక్ష్మి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చింది. అప్పటి నుంచి కళ్యాణితో తల్లి, సోదరులు తరచూ ఘర్షణకు దిగుతున్నారు.
ఆస్తి తగదాతో పాటు జైలుకు పంపిందనే కక్షతో రగిలిపోతున్న తల్లి సాయిలక్ష్మి, చెల్లెళ్లు దివ్యజ్యోతి, విజయలక్ష్మి శుక్రవారం ఉదయం ఎల్ఎన్నగర్లోని తన ఇంటి నుం చి స్కూటీపై బయటకు వెళ్తున్న కళ్యాణిపై ఒక్కసారిగా దాడి చేశారు. తమతో పాటు తెచ్చుకున్న కత్తి తో తల్లి సాయిలక్ష్మి.. కళ్యాణిపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు.