ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు
హెడింగ్లీ:ఒకే ఓవర్ లో ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ రాస్ వైట్లే. నాట్‌వెస్ట్ టీ 20 లీగ్ లో భాగంగా ఆదివారం యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో వోర్స్స్టెర్ షైర్ ఆటగాడు ఆరు బంతుల్ని బౌండరీ దాటించి కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన వోర్స్స్టైర్ షైర్ కు ఆశించిన ఆరంభం దక్కలేదు.
మరొకవైపు మిగిలి ఉన్న బంతులికి పరుగులికి మధ్య అంతరం భారీగా పెరిగుతూ వచ్చింది. అదే సమయంలో యార్క్‌షైర్ స్పిన్నర్ కార్ల్ కార్వెర్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్లో రాస్ వైట్లే ఆరు సిక్సర్లు కొట్టి సత్తాచాటాడు. బంతి వేయడమే తడువు అన్నట్లుగా చెలరేగి ఆడాడు. ఆ ఓవర్ లో ఒక వైడ్ కూడా పడటంతో 37 పరుగుల్ని సమర్పించుకున్నాడు కార్వెర్. అయితే 25 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 2 ఫోర్లుతో 65 పరుగులు చేసిన వైట్లే ఐదో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో వోర్స్స్టెర్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో యార్క్‌షైర్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఓవరాల్ గా చూస్తే ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లుగా మలిచిన ఆరో క్రికెటర్ గా వైట్లే ఘనత సాధించాడు. అంతకుముందు గ్యారీ సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి( భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్ సింగ్(భారత్), జోర్దాన్ క్లార్క్(ఇంగ్లండ్)లు ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు.