భర్త హత్య కేసులో భార్య, కొడుకుల అరెస్ట్
తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఉరివేసి చంపిన కేసులో పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. అయితే తండ్రిని హత్య చేసేందుకు తల్లికి సహకరించినందుకు మృతుడి ఇద్దరు కొడుకులను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనగామ డీఎస్పీ కే.సురేందర్ నిందితుల వివరాలు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఇంటివద్ద ఉంటున్న మండలంలోని గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన బోకూరి వెంకటరెడ్డి(45) కొద్ది నెలలుగా తాగుడుకు బానిసయ్యాడు. అయితే ఏ పనిచేయకుండా ఇంట్లో డబ్బులు తీసుకుని వెళ్లి తాగివస్తున్న వెంకటరెడ్డి భార్య ను రోజు అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మృతుడు వెంకటరెడ్డిని ఈనెల 4వ తేదీన తెల్లవారుజామున అతడి భార్య వీరలక్ష్మి, కొడుకులు వినోద్‌రెడ్డి, స్వర్ణాకర్రెడ్డిల సహకారంతో గొంతునులిమి టవల్‌తో ఫ్యాను కు ఉరివేసి హతమార్చింది. అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు వారంతా మృతు డి నోటిలో పురుగుల మందుపోసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.
అయితే మరుసటి రోజు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మృతుడు వెంకటరెడ్డి సోదరుడు ఆయన మృతిపై అనుమానం వ్యకం చేస్తూ కుటుంబసభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి వీరలక్ష్మి, ఆమె కొడుకు వినోద్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. మరో కుమారుడు స్వర్ణాకర్రెడ్డి మైనర్ కావడంతో అతడిని జువైనల్ కోర్టుకు పం పిం చినట్లు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ నారాయణరావు, ఎస్సై రాజేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
చంపడంతో సమస్యలు పరిష్కారం కావు..
తాగుడుకు బానిసై చిత్రహింసలకు గురిచేసే భర్తలను క్షణికావేశంలో చంపితే సమస్యలు పరిష్కారం కావని డీఎస్పీ సురేందర్ అన్నారు. తొందరపాటుతో కుటుంబసభ్యులను చంపి సమాజంలో దోషులుగా నిలువద్దని ప్ర జలకు సూచించారు. కుటుంబ సమస్యలతో బాధపడేవారికి ప్రతి సోమవారం డీఎస్పీ కార్యాలయం లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.