కూరలు కుతకుత!
‘దరికి రాబోను రాబోనూ రాజ’ అంటూ కూరగాయలు కూనిరాగాలు తీస్తున్నాయి! ఈ గానంతో సామాన్యుడు అదిరిపడుతున్నాడు. ఇంకొందరైతే బెదిరిపోతున్నారు. తక్కువ వేతన జీవులు బేజారవుతున్నారు. నాలుగు నెలలుగా ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మరో నెల వరకు ఇలాగే ఉండొచ్చని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ రైతులకు పెద్దగా గిట్టుబాటు కాకపోవడం.. మారు వ్యాపారుల జాదూకు నిదర్శనం.
- న్యూస్‌లైన్, కరీంనగర్ కార్పొరేషన్
జిల్లాలో ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో కూరగాయల సాగు అధికం. సుమారు 5 వేల ఎకరాల్లో రైతు లు టమోట, కాకర, సొరకాయ, వంకాయ, దొండ, బెండ, బీరకాయ, మిరప, చిక్కుడు తదితరాలు సాగు చేస్తున్నారు. ఉల్లిపాయలు, క్యారట్, బంగాళా దుంప, అల్లం పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. గత మేలో దిగుబడి లేక ధరలు అమాంతం పెరిగాయి. నాలుగు నెలలుగా దిగిరావడం లేదు. ప్రస్తుతం వర్షా లు బాగానే ఉన్నా.. దిగుబడి ఆశాజనకంగానే ఉంటు న్నా యథాతథ స్థితే కొనసాగడం ఆందోళన కలిగిస్తోం ది. బీర, బెండకాయలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నా ధరలు తగ్గకపోవడం గమనార్హం. అన్ని వంటల్లో ఉపయోగించే టమాట ధర కాస్త తగ్గడం ఒక్కటే ఊరట.
మారు వ్యాపారుల జాదు..
మారు వ్యాపారులు తక్కువ రేట్లకు కొని మార్కెట్ ధరలను తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు. రైతులు కూరగాయలను జిల్లా కేంద్రానికి తెచ్చి హోల్‌సేల్ ధరలకు అమ్ముతారు. కూరగాయలను ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తుంటారు. నేటికీ కరీంనగర్‌కు పెద్ద ఎత్తున కూరగాయలు వస్తున్నట్లు వ్యాపారులే చెబుతున్నారు. అయినా ధరలు తగ్గకుండా మారు వ్యాపారులు ‘జాగ్రత్త’పడుతున్నారు.
రైతు బజార్లలో మాత్రం కొంత మేర ధరలు తక్కువే. ధరల నియంత్రణకు అధికారులు చొరవ చూపకపోవడంతో వ్యాపారులు ఆడింది ఆటగా సాగుతోంది. చివరకు పాలకూర, చుక్కకూర, తోటకూరలనూ కిలో రూ. 50 పైనే అమ్ముతున్నారు. రోజువారీ కూలీలు, తక్కువ వేతన జీవుల పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యావసరాలకే సంపాదన ఖర్చు చేసే దుస్థితి దాపురించింది. నలుగురు కుటుంబ సభ్యులుంటే రోజుకు రూ. 100 కూరగాయలకే ఖర్చవుతోంది. ఇక రాబోయే పెళ్లిళ్ల సీజన్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యులు హడలెత్తిపోతున్నారు.