పరువు నష్టం దావా వేస్తా
లతా రజనీకాంత్
తమిళసినిమా : నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ నకిలీ డాక్యుమెంట్స్ వ్యవహారం కోర్టులు, కేసులు అంటూ కలకలం సృష్టిస్తోంది. రజనీకాంత్ నటించిన 3డీ యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం విడుదల కోసం *6.84 కోట్లు అప్పుగా ఇచ్చిన అట్ బ్యూరో సంస్థ ఆ డబ్బును తిరిగి చెల్లించకపోవడంతో లతా రజనీకాంత్‌పై ఈ నెల ఆరవ తారీఖున బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసును విచారించిన కోర్టు పూర్తి వివరాలను దర్యాప్తు చేసి లతా రజనీకాంత్ పై చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో లతా రజనీకాంత్ తనకు సంబంధించిన విషయాలు బయటకు రాకూడదంటూ బెంగుళూరు సిటీ సివిల్ కోర్టులో స్టే తెచ్చుకున్నారు. అయితే దాన్ని చెన్నై హైకోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా బెంగుళూరు సిటీ సివిల్ కోర్టులో స్టే పొందడానికి లతా రజనీకాంత్ నకిలీ డాక్యుమెంట్స్‌ను సమర్పించారంటూ పిటీషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారించిన కోర్టు తగిన చర్యలు చేపట్టాలని బెంగుళూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు లతా రజనీకాంత్ పేర్కొన్న మీడియా సంస్థ లేదని తెలియడంతో ఆమెపై ఐదు విభాగాలలో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
నిజాలు మరిచారా: ఈ వ్యవహారంపై స్పందించిన లతా రజనీకాంత్ వర్గం మంగళవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో పేర్కొంటూ అట్ బ్యూరో సంస్థ డెరైక్టర్ అబిర్‌సేన్ నహార్, ఆయన భార్య సంబల్నహార్లు తనపై మోపిన ఆరోపణలన్నీ అసత్యాలేనన్నారు. వారు నిజాలు మరచి బెంగుళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పారు. వాటి ఆధారంగా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో అట్ బ్యూరో అధినేతలపై సివిల్ క్రిమినల్ కేసులు పెట్టి చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయనున్నట్టు పేర్కొన్నారు.