ఉదయ్ లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా: విషిత
దివంగత నటుడు ఉదయ్‌కిరణ్ సంస్మరణ సభ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఉదయ్‌కిరణ్ మేనేజర్ మున్నా ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ఉదయ్‌కిరణ్ భార్య విషిత, తండ్రి మూర్తి, అక్కాబావలు శ్రీదేవి, ప్రసన్న, నటుడు నాని దంపతులు, మల్టీ డైమన్షన్ వాసు, నటి ఢిల్లీ రాజేశ్వరి హాజరయ్యారు. ఈ సభలో ఉదయ్‌కిరణ్ భార్య విషిత మాట్లాడుతూ... ఒక్కసారిగా కన్నీటిపర్యంతమవ్వడం పలువురి హృదయాల్ని కలచివేసింది. ‘‘ఉదయ్ నా ఊపిరి. ఆయన లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను. రేపు ఎలా గడుస్తుందో తలచుకుంటే భయమేస్తోంది.
ఉదయ్‌కి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది. కానీ నిమిషం ఆలోచించలేకపోయాడు’’ అని బాధా తప్త హృదయంతో కన్నీరుమున్నీరయ్యారు విషిత. బాధలో ఉన్న తనకు తన వదిన శ్రీదేవి మోరల్ సపోర్ట్ అందించారని, రేపు ఆమె కూడా వెళ్లిపోతున్నారని విషిత ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్‌కిరణ్ అంతిమ యాత్రలో పాల్గొన్న అభిమానులకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఉదయ్‌కిరణ్ అక్క శ్రీదేవి మాట్లాడుతూ -‘‘ఉదయ్ చనిపోయిన బాధతో ఓ అభిమాని సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. ఇలాంటి చర్యలు అభిమానులకు తగదు. ఆ అభిమాని తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’’ అన్నారు.