అడవిలో ఆర్డర్లీ
అటవీశాఖలో ఆటవిక న్యాయం
ఔట్సోర్సింగ్ సిబ్బందితో అడ్డగోలు చాకిరీ
► బాత్రూంలు కడిగించడం నుంచి బట్టలు ఉతకడం దాకా అన్నీ వారితోనే..
► కనీస వేతనం రూ. 12 వేలు ఇవ్వాల్సి ఉన్నా.. ముప్పై ఏళ్లుగా రూ. 6,700
► పీఎఫ్ సొమ్మునూ బొక్కేస్తున్న కాంట్రాక్టర్లు పశ్నిస్తే పనులకు రావొద్దంటూ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: అడవి తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయదంటారు... తనను కాపాడే వారిని ఒడిలో పెట్టుకుని చూసుకుంటుందంటారు.. నిజమే..మూడు దశాబ్దాలుగా తనను నమ్ముకున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని అడవి కన్నబిడ్డల్లానే చూసుకుంటున్నా అధికార యంత్రాంగం మాత్రం వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటోంది! వారితో బీట్ ఆఫీసర్, ఉన్నతస్థాయి అధికారుల ఇళ్లలో బాత్రూంలు క్లీన్ చే యించడం, వంటలు చేయించడం, బట్టలు ఉతకటం, పిల్లల్ని ఆడించటం వంటి పనులు చేయిస్తున్నారు.
అంతేకాదు.. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 14 ప్రకారం రూ.12 వేల కనీస వేతనం ఇవ్వాల్సి ఉన్నా రూ.6,700 మాత్రమే చెల్లిస్తున్నారు. పీఎఫ్ సైతం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తోంది. హైదరాబాద్‌లోని జూపార్కు, అరణ్యభవన్‌లో పనిచేస్తున్న వారికి నెలకు రూ.9 వేలు చెల్లిస్తున్నా.. మిగతాచోట్ల కేవలం రూ.6,700 చెల్లిస్తున్నారు. ఫారెస్ట్ రేంజ్ వారీగా ఔట్సోర్సింగ్ కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు సిబ్బంది నుంచి పీఎఫ్ మొత్తాన్ని సేకరిస్తున్నా.. దాన్ని కార్మికుల ఖాతాలో జమ కూడా చేయకుండా భారీ అవినీతికి తెర లేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రశ్నిస్తే.. పనికి రావొద్దంటూ..
తెలంగాణ అటవీశాఖలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,400 మంది బేస్‌క్యాంప్ వర్కర్లు, స్ట్రైక్‌ఫోర్స్, యానిమల్ ట్రాకర్స్, యానిమల్ కీపర్లు, వాచర్లు, చెక్‌పోస్ట్ వాచర్లుగా పనిచేస్తున్నారు. పోలీస్ శాఖలో అర్డర్లీ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం అటవీ శాఖను వదిలేసింది. దీంతో అడవిలో ఆర్డర్లీ వ్యవస్థ పక్కాగా అమలవుతోంది. వెట్టి పనులపై ప్రశ్నించే వారిని.. ‘రేపట్నుంచి పనికి రావొద్దు’ అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. బాత్రూం శుభ్రపర్చటం నుంచి బట్టలు ఉతకటం, పిల్లల్ని ఆడించటం వంటి పనులు చేయిస్తున్నారు. భవన నిర్మాణ పనులు, రంగులు వేయించటం, భూసార పరిరక్షణ తదితర పనులు కూడా అప్పజెప్పుతున్నారు. వాస్తవానికి ఈ పనులను చేసేందుకు ప్రత్యేక బడ్జెట్లు ఉండాలి. టెండర్లు వేయాలి. కానీ రేంజ్ ఆఫీసర్లు.. ఈ పనులన్నింటినీ వాచర్లు, ట్రాకర్లు, స్ట్రైక్ ఫోర్స్‌తో చేయించి, ఆ మొత్తాలను సొంత ఖాతాలోకి మళ్లించుకుంటున్నట్లు సమాచారం.
ఇదిగో సిబ్బంది గోస..
• హైదరాబాద్‌లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో బట్టమేకల సోమయ్య(70) ముప్పై ఏళ్లుగా వాచర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇస్తున్న జీతం నెలకు రూ.6,700. పీఎఫ్ మొత్తాన్ని కట్ చేస్తున్నా ఇంత వరకు అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఇక్కడే పనిచేస్తున్న తేలు లింగయ్య సహా ముప్పై రెండు మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. జూ పార్కు, అటవీశాఖ ప్రధాన కార్యాలయం మినహా అన్ని జాతీయ పార్కులు, రేంజ్‌ల్లో వెట్టి, జీతాల కోత సాధారణంగా మారింది.
• కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐదేళ్లుగా యానిమిల్ కీపర్‌గా పనిచేస్తున్న నిరంజన్‌రెడ్డి అనే కార్మికుడిని దుప్పి పొడవటంతో ఒక కిడ్నీ తొలగించారు. పీఎఫ్ ఇతరత్రా సాయం ఏదీ అందలేదు. ఇదే తరహాలో మన్ననూరు అటవీప్రాంతంలో స్ట్రైక్‌ఫోర్స్‌గా పనిచేస్తున్న రాములుపై ఎలుగుబంటి దాడి చేయటంతో దుర్మరణం పాలయ్యాడు. ఆయన కుటుంబానికి నయాపైసా సహాయం అందలేదు.
• ఔట్సోర్సింగ్ సిబ్బందితో నిర్మాణ పనులు, భూ సంరక్షణ తదితర పనులు చేయిస్తున్నారు. ఆ పనులను కాంట్రాక్టర్లతో చేయించినట్లు భారీ బిల్లులతో ప్రభుత్వానికి పంగ నామాలు పెడుతున్నారు
ప్రభుత్వం స్పందించాలి
అటవీశాఖలో ఆర్డర్లీ, కనీస వేతనాలు చెల్లించకపోటం, పీఎఫ్‌లో అవినీతిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కార్మికులతో అడ్డగోలు చాకిరీ చేయించడంపై సీఎం విచారణ జరిపించాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అటవీశాఖలో మార్పు కనిపించకపోవటం దారుణం.
- అల్వాల్ శివకుమార్, అధ్యక్షుడు, అటవీశాఖ ఉద్యోగ, కార్మిక సంఘం