wild pig
-
పందులను చంపే అధికారం సర్పంచ్‌కే
సాక్షి, హైదరాబాద్: పంటలకు నష్టం చేకూర్చే అడవి పందులను హతమార్చేందుకు అనుమతుల జారీ అధికారాన్ని అటవీ, పర్యావరణ శాఖ గ్రామ సర్పంచ్‌లకు కల్పిం చింది. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌ను గౌరవ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షిత ప్రాంతాలు, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల వెలుపల అడవి పందుల నుంచి మనుషుల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగే అవకాశాలున్న చోట కొన్ని నిబంధనలకు లోబడి వాటిని అంతమొందించేందుకు సర్పంచ్‌లకు అవకాశం కల్పిం చింది. అయితే రాష్ట్ర స్థాయిలో చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆదేశాలకనుగుణంగా సర్పంచ్‌లు ఈ పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అధికారి నుంచి ఆదేశాలు వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ అధికారాలు అమల్లో ఉంటాయని మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ‘అడవి పందుల నుంచి పంట నష్టం లేదా ఇతర సమస్యలపై రైతుల నుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు ఉంటేనే సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదు అందిన తర్వాత సర్పంచ్, గ్రామ పెద్దలు సంబంధిత ప్రదేశాన్ని సందర్శించి అడవి పందులను హతమార్చాల్సిన పరిస్థితులపై పంచనామా నిర్వహించి సిఫార్సు చేయాలి. అందుకు అనుగుణంగా ఆ పందులను చంపేందుకు సర్పంచ్‌లు ఆదేశాలిస్తారు. వీటి సంహారానికి అటవీశాఖ ప్యానెల్‌లోని షూటర్ల సేవలను ముఖ్యంగా సంబంధిత గ్రామం, మండలం, జిల్లాలో దీనికి సంబంధించిన లైసెన్స్, ఆయుధం, పందులను కాల్చడంలో నైపుణ్యం వంటివి ఉన్న వారిని ఎంపిక చేయాలి. పందులను చంపేటప్పుడు ఇతర జంతువులు, మనుషులు గాయపడకుండా, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు -
అడవి పందులను చంపటం నేరం కాదు
సాక్షి, హైదరాబాద్: పంటను నాశనం చేసే అడవి పందులను చంపడం నేరం కాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభలో ప్రకటించారు. గతంలో అడవి పందులను చంపితే వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసేవాళ్లమని, ఇకపై రైతులు వాటిని చంపటం నేరం కాదని పేర్కొన్నారు. వన్యప్రాణుల మూలంగా పంటలు నష్టపోకుండా నివారణ చర్యలు ఏమైనా తీసుకున్నారా.. అని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా సమాధానమిచ్చారు. అక్కడక్కడా కోతులు, అడవిపందులు పంటలను ధ్వంసం చేస్తున్నాయని, వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోందని చెప్పారు. గతంతో కొండెంగలను వదిలితే కోతులు పారిపోయేవని, కానీ ఇప్పుడు వాటి మధ్య దోస్తీ కుదిరిందని చమత్కరించారు. బయోమెడిసిన్ ద్వారా కోతులు, అడవిపందుల్లో పునరుత్పత్తి నియంత్రించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు. కల్తీ రసాయనాలు, నకిలీ విత్తన నియంత్రణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పోచారం స్పందిస్తూ నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ చట్టం ప్రయోగించే విధంగా చట్టం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 2.37 లక్షల నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్ చేసి ఇద్దరిపై పీడీ చట్టం ప్రయోగించినట్లు చెప్పారు. ఈ సమావేశాల్లోనే విత్తన చట్టం: పోచారం ప్రస్తుతం ఆర్డినెన్స్‌గా ఉన్న విత్తన చట్టాన్ని ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై లఘు ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ వచ్చే ఏడాది నుంచి దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో సీజన్‌కు రైతుకు పెట్టుబడిగా ఎకరాకు రూ. 4,000 అందిస్తామన్నారు. పంటలు వేసుకునే సమయాలను మార్చాలని నిర్ణయించామన్నారు. అందుకోసం వ్యవ సాయశాఖ కసరత్తు చేస్తుందన్నారు. రైతు యూనిట్‌గా బీమా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ రెండోసారి తీర్మానం చేస్తామన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులపై కేసులను ఎత్తేయాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేయగా ఆ అంశం తన పరిధిలోనిది కాదని, తాను కూడా çహోంమంత్రిని ఇదే కోరుతున్నానన్నారు. -
బిడ్డ కోసం అపర కాళిలా..!
తన బిడ్డకు అపాయం వస్తోందంటే.. తల్లి ఊరుకుంటుందా? అపరకాళిలా మారి ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కదూ. మనుషులే కాదు.. కోతులు కూడా అలాగే చేస్తాయని మరోసారి రుజువైంది. బోర్నియా ప్రాంతంలోని అడవుల్లో ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిద్దామని వెళ్లి రష్యా ఫొటోగ్రాఫర్ జూలియా సుండుకోవాకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కోతి జాతికి చెందిన ఒరాంగుటాన్.. తన బిడ్డ మీదకు ఓ అడవిపంది వస్తుంటే దాన్ని కర్రతో తరిమి తరిమి కొట్టింది. పిల్ల ఒరాంగుటాన్ మీద దాడి చేద్దామని వచ్చిన అడవిపందిని చూసి... తల్లి వెంటనే అడవిలో ఉన్న కట్టెపుల్ల తీసుకుని.. అడవిపంది ముఖం మీద కొట్టింది. దాన్ని తరిమి కొట్టేందుకు తనకు చేతనైన అన్ని ప్రయత్నాలు చేసింది. పెద్దపెద్దగా అరుస్తూ దాన్ని కర్రతో భయపెడుతూ చెట్టు కొమ్మలను విరిచి దాని మీద వేయడం మొదలుపెట్టింది. ఈ దృశ్యాలన్నింటినీ రష్యా ఫొటోగ్రాఫర్ చకచకా తన కెమెరాలో బంధించారు. ఆ తల్లి ఒరాంగుటాన్ దెబ్బకు భయపడిన అడవిపంది.. ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుంటూ అక్కడి నుంచి చల్లగా జారుకుంది.