ఫొటో తీస్తుంటే దూసుకొచ్చిన పులి
ఈ రోజుల్లో స్వీయ చిత్రాలకు(సెల్ఫీలు), వీడియోలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇలాంటివి క్షణికానందాలే అనే విషయం మరిచిపోయి తమకు నచ్చితే చాలు వెంటనే ఓ వీడియో తీసుకుంటూనో, ఓ సెల్ఫీ దిగుతూనో ఒక్కోసారి ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అదృష్టం ఉన్నవాళ్లయితే గాయాలతో బయటపడుతుండగా.. ఇంకొందరు చనిపోతున్నారు. అందుకే ఇలాంటి చర్యల విషయంలో కనీసం పరిజ్ఞానం ఉండాలని ఓ సంఘటన చెబుతోంది. ఇటీవల డిసెంబర్ 4న వన్య మృగాలను చూడాలని, అడవిలో సంచరించాలనే ఉత్సాహంతో కొంతమంది వ్యక్తులు ఓ అటవీ ప్రాంతంలో వైల్డ్ లైఫ్ ప్రోగ్రాంతో వెళ్లారు.
వారిలో కొందరు ఏనుగుపై ఎక్కి ముందుకు సాగగా.. ఇంకొందరు జీపులో ముందుకు కదిలారు. అలా వెళుతున్న క్రమంలో ఓ పొదల మాటున పులి కనిపించింది. ఆ సమయంలోనే పులి ఎదురుపడినప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో సరిగ్గా వారు అదే చేశారు. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లాల్సిందిపోయి తమ చేతుల్లోని కెమెరాలు తీసుకొని టకటకా ఫొటోలకు, దూరం నుంచి సెల్ఫీలకు ప్రయత్నించారు. దీంతో కెమెరా క్లిక్ మనే శబ్దంకాస్త పులి చెవిన పడి ఒక్కసారిగా అది గాండ్రుమని దూసుకొచ్చింది.
ఏనుగుపై ఉన్నవారికి, జీపులోని నలుగురికి ఆ సీన్ చూసి గుండెలు ఆగిపోయాయి. చచ్చాం దేవుడా అనుకునేలోగా వారి అదృష్టం కొద్ది ఏనుగు ఘీంకారంతో పులి కాస్త అడవిలోకి పరుగులు తీసింది. దీంతో వారంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అందుకే ఫొటోలు, వీడియోలు తీసే సమయంలో కాస్తంత అప్రమత్తంగా ఉంటే అన్ని విధాల మంచిదని చెబుతూ వన్యప్రాణి సంరక్షణ సేవకుడు బిట్టు సెహగల్ తన ఫేస్ బుక్ పేజీలో వివరాలు పోస్ట్ చేశారు.