జీవ వైవిధ్యాన్ని కాపాడే.. వైల్డ్‌లైఫ్ ఎక్స్పర్ట్
భూమిపై మనిషి క్షేమంగా మనుగడ సాగించాలంటే.. చుట్టూ ఉన్న జీవజాలం భద్రంగా ఉండాలి. అవి నశిస్తే మానవ జాతి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. భూగోళంపై అన్ని జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తుంటాయి. ఇది ఒక గొలుసుకట్టు చర్య. ఒక చోట తెగిపోతే తలెత్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. విలువైన అటవీ సంపదను, జీవ వైవిధ్యాన్ని కాపాడేవారే వైల్డ్‌లైఫ్ ఎక్స్పర్ట్స్. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరుగుతుండడంతో ఇలాంటి నిపుణులకు డిమాండ్ అధికమవుతోంది.
ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో అవకాశాలు
వైల్డ్‌లైఫ్ నిపుణులు అటవీ సంపదను, ప్రకృతిలోని అన్నిరకాల పశుపక్ష్యాదులను, జంతువులను, వృక్షాలను కాపాడాల్సి ఉంటుంది. వీరికి ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అటవీ శాఖల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లోనూ ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. కన్సల్టెంట్‌గా కూడా సేవలందించొచ్చు.అంతేకాకుండా తగిన ఆసక్తి ఉంటే విద్యాసంస్థల్లో ఫారెస్ట్రీ కోర్సులను బోధించే ఫ్యాకల్టీగా చేరొచ్చు. వైల్డ్‌లైఫ్ నిపుణులకు ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో అధిక వేతనాలుంటాయి. సవాళ్లను ఇష్టపడేవారు ఇందులోకి నిరభ్యంతరంగా ప్రవేశించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కావాల్సిన నైపుణ్యాలు:
వైల్డ్‌లైఫ్ నిపుణులకు ప్రకృతిపై ఆసక్తి ఉండాలి. జీవజాలాన్ని, పచ్చటి అరణ్యాలను అభిమానించే గుణం ఉండాలి. శాస్త్రీయ దృక్పథం అవసరం. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. వేగంగా నిర్ణయాలు తీసుకొనే నేర్పు కావాలి. ఈ రంగంలో ఎక్కువగా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. తరచుగా ప్రయాణాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి అడవుల్లో రోజుల తరబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందుకు తగ్గట్లుగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అడవుల్లో ఫారెస్ట్ మాఫియా, స్మగ్లర్లు దాడులు చేసే అవకాశం ఉంటుంది. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి. వైల్డ్‌లైఫ్ నిపుణులుగా మారితే జీవరాశులను, ప్రకృతిని కాపాడుతున్నామన్న ఆత్మసంతృప్తి లభిస్తుంది.
అర్హతలు: మనదేశంలో ఫారెస్ట్ మేనేజ్మెంట్లో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరొచ్చు.
వేతనాలు: ప్రభుత్వ రంగంలో అటవీ శాఖలో వైల్డ్‌లైఫ్ నిపుణులకు, ఫారెస్ట్ అధికారులకు ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌కు నెలకు రూ.75 వేల నుంచి రూ.80 వేలు, అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌కు రూ.35 వేల నుంచి రూ.60 వేలు, డిప్యూటీ కన్జర్వేటర్‌కు నెలకు రూ.20 వేల నుంచి రూ.35 వేల వేతనం లభిస్తుంది. కిందిస్థాయి సిబ్బందికి, గార్డులకు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం అందుతుంది.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్-భోపాల్
వెబ్సైట్: www.iifm.org
ఇన్స్టిట్యూట్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ-హైదరాబాద్
వెబ్సైట్: http://frc.icfre.gov.in
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ
వెబ్సైట్: www.amu.ac.in
డాక్టర్ వైఎస్ పార్మర్ యూనివర్సిటీ ఆఫ్
హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీa
వెబ్సైట్: www.yspuniversity.ac.in
పోస్టు గ్రాడ్యుయేట్ స్కూల్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్-న్యూఢిల్లీ
వెబ్సైట్: www.iari.res.in
ఆసక్తి, అభిరుచి ఉండాలి!
‘‘పర్యావరణం, వన్యప్రాణులపై ఆసక్తి, అభిరుచి ఉన్నవారు వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత మాస్టర్స్ స్థాయిలో వైల్డ్‌లైఫ్ కోర్సులు అం దుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-డెహ్రాడూన్ ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. దేశంలో ఇతర విద్యాసంస్థలు కూడా పలు డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తుండడంతో వైల్డ్‌లైఫ్ నిపుణులకు అవకాశాలకు కొదవ లేదు. సైన్స్ విద్యార్థులు ముఖ్యంగా వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం విద్యార్థులు ఈ రంగంలో సులభంగా రాణిస్తారు. దేశంలోని పలు జంతు ప్రదర్శనశాలలు, ఫారెస్ట్ మేనేజ్మెంట్ విద్యా సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థల్లోనూ వైల్డ్‌లైఫ్ నిపుణులకు అవకాశాలున్నాయి. వైల్డ్‌లైఫ్ శాస్త్రవేత్తలుగా సైతం కెరీర్లో స్థిరపడొచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) పరీక్షలో అర్హత సాధించి ఉన్నత సర్వీస్‌లో చేరొచ్చు’’
- డా. ఎం.ఆర్.జి.రెడ్డి, ఐఎఫ్ఎస్, డెరైక్టర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, హైదరాబాద్