తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాం
ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ విలియం దార్ వెల్లడి
వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వ్యూహం రూపొందించామని వెల్లడి
త్వరలో పదవీ విరమణ చేయనున్న విలియం దార్
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు ఇక్రిశాట్ సిద్ధంగా ఉందని ‘వర్షాభావ ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్)’ డెరైక్టర్ జనరల్ విలియం దార్ పేర్కొన్నారు. వ్యవసా య రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేం దుకు ఒక వ్యూహాన్ని సిద్ధం చేశామని, ప్రస్తుతం కార్యాచరణ ప్రణాళికను రూపొందించే పని నడుస్తోందని ఆయన చెప్పారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో విలియం దార్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసినప్పుడు ఆ రాష్ట్రంలోనూ ‘భూ చేతన’ కార్యక్రమాన్ని చేపట్టే విషయంపై చర్చలు జరిగాయని తెలిపారు. కర్ణాటకలో కొన్నేళ్ల క్రితం చేపట్టిన భూ చేతన కార్యక్రమం ద్వారా దాదాపు 40 లక్షల మంది లబ్ధిపొందారని, భూసారం పెరగడంతోపాటు సుస్థిర వ్యవసాయానికి, దిగుబడులు, ఆదాయ వృద్ధికి ఇది దోహదపడిందని వివరించారు. ‘‘నేను బాధ్యతలు చేపట్టే సమయానికి ఇక్రిశాట్ ఓ మునిగిపోతున్న పడవ మాదిరిగా ఉంది.
సంస్థ పునర్నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు పేద రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న మార్గాలను అవలంబించడంతో నేడు ఇక్రిశాట్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి వ్యవసాయ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చెందింది.’’ అని విలియం దార్ పేర్కొన్నారు. మాతృదేశానికి సేవ చేసే సమయం ఆసన్నమైందని చెప్పారు. కార్యక్రమంలో ఇక్రిశాట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సి.ఎల్.ఎల్.గౌడ తదితరులు పాల్గొన్నారు.
వరుసగా మూడు సార్లు..
శాస్త్ర పరిశోధనలకు మానవతావిలువలు తొడిగిన వ్యక్తిగా పేరు గడించిన దార్ 2000లో ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఐదేళ్ల పదవీకాలమున్న ఈ పదవికి దార్ వరుసగా మూడుసార్లు ఎంపికవడం విశేషం.