4వేల కోట్లతో యూఎస్ కంపెనీని కొనుగోలు చేసిన విప్రో!
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా యూఎస్ కంపెనీ రైజింగ్ ఇంటర్మీడియెట్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. కంపెనీలో పూర్తి(100 శాతం) వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు 54 కోట్ల డాలర్ల(రూ. 4,135 కోట్లు)ను వెచ్చించనున్నట్లు వెల్లడించింది.
తద్వారా ఎస్ఏపీ(శాప్) కన్సల్టింగ్ సామర్థ్యాలను భారీగా మెరుగుపరచుకోనున్నట్లు పేర్కొంది. ఐటీ పరిశ్రమలో రైజింగ్‌కున్న నైపుణ్యం, ఎంటర్ప్రైజ్ అసెట్ మేనేజ్మెంట్లో శాప్ కన్సల్టింగ్ సామర్థ్యాలు, కన్జూమర్ పరిశ్రమలు, మానవవనరుల నిర్వహణా అనుభవం వంటి అంశాలు కంపెనీ పురోభివృద్ధికి దోహదపడనున్నట్లు విప్రో వివరించింది. తద్వారా అత్యంత క్లిష్టమైన శాప్ ట్రాన్స్‌ఫార్మేషన్స్‌లో క్లయింట్లకు సమర్థవంత పరిష్కారాలు అందించగలమని తెలియజేసింది.
యాంటీట్రస్ట్ నుంచి..
రైజింగ్ కొనుగోలు డీల్‌కు యూఎస్, జర్మనీ, కెనడాకు చెందిన పోటీ చట్టాలకు సంబంధించిన యాంటీట్రస్ట్ అనుమతులు లభించవలసి ఉన్నట్లు విప్రో వెల్లడించింది. జూన్‌కల్లా డీల్ పూర్తికాగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. డీల్ తదుపరి రైజింగ్.. విప్రో కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత సీఈవో మైక్ మావొలో అధ్యక్షతన విప్రో దన్నుతో కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. 16 దేశాలలో కార్యకలాపాలు కలిగిన రైజింగ్‌కు 1,300 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నట్లు వెల్లడించింది.
రైజింగ్ కొనుగోలు వార్తల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 529 వద్ద ముగిసింది.