రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ
కనగానపల్లి : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు టీడీపీని వీడారు. రాప్తాడు నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం కలిసి ఆ పార్టీలో చేరారు. వీరిలో కనగానపల్లి తాజా మాజీ ఎంపీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎంపీపీ పున్నం వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ ఉన్నారు. మంత్రి పరిటాల సునీత బంధువులు, అనుచరుల అజమాయిషీని భరించలేకనే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు ప్రకటించారు.
అణచివేతను భరించలేక..
2014లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనగానపల్లి మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను ఆరు స్థానాలను వైఎస్ఆర్ సీపీ, ఐదు స్థానాలను టీడీపీ దక్కించుకున్నాయి. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఎలక్కుంట్ల ఎంపీటీసీ సభ్యుడు బిల్లే రాజేంద్రను ఎంపీపీ చేశారు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఐదేâýæ్ల పాటు బీసీలను ఆ పదవిలో కొనసాగించ డం ఇష్టంలేని పరిటాల వర్గీయులు ఇటీవల బిల్లే రాజేంద్రపై ఒత్తిళ్లు తీసుకొచ్చి బలవంతంగా రాజీనామా చేయించారు. తెరపైకి తమ సామాజిక వర్గానికి చెందిన ముత్తువకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు పద్మగీతను తీసుకొచ్చారు. బలహీన వర్గాలపై అణచివేతను నిరసిస్తూ రాజేంద్రతో పాటు వైస్ ఎంపీపీ వెంకట్రామిరెడ్డి, కనగానపల్లి ఎంపీటీసీ సభ్యురాలు బిల్లే గంగమ్మ టీడీపీ నుంచి బయటకొచ్చేశారు. తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం జరగనున్న ఎంపీపీ ఎన్నిక రసవత్తవరంగా మారనుంది.