మరో 18 మంది బందీ!
రాష్ట్ర జాలర్లలో ఆగ్రహ జ్వాల రగులుతోంది. తాజాగా మరో 18 మంది జాలర్లను శ్రీలంక సేనలు బందీగా పట్టుకెళ్లారుు. వరుస దాడులు జాలర్లలో ఆక్రోశాన్ని రగల్చడంతో భారీ ఆందోళనలకు జాలర్ల సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. కేంద్రం తీరును డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా దుయ్యబట్టారు.
సాక్షి, చెన్నై:
రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేనలు వరుసగా దాడులు చేస్తూ వస్తున్న విషయం తెలి సిందే. 15 రోజుల వ్యవధిలో 250 మందిని శ్రీలంకకు పట్టుకెళ్లి జైళ్లలో బంధించేశారు. తమ వాళ్ల పరిస్థితి అంతు చిక్కక ఇక్కడున్న కుటుంబాలు తీవ్ర మనో వేదనలో మునిగి పోయూరుు. ఈ దాడులకు అడ్డుకట్ట వేస్తామంటూ శనివారం తనను కలిసిన జాలర్ల సంఘాల ప్రతినిధులకు ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హామీ ఇచ్చారు. వారు అలా హామీ ఇచ్చారో లేదో ఆదివారం 22 మందిని శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లిం ది. ఈ ఘటన జాలర్లలో ఆగ్రహాన్ని తెప్పిం చగా, పుండు మీద కారం చల్లినట్టుగా సోమవారం మరి కొందర్ని పట్టుకెళ్లారు.
పడవలూ వదల్లేదు: రామేశ్వరానికి చెందిన జాలర్ల మర పడవలు ప్రస్తుతం చేపల వేటలో బిజీ బిజీగా ఉన్నాయి. ఇందుకు కారణం శీలా వంటి చేపలు అత్యధికంగా ఈ సీజన్లో లభించడమే. ఆదివారం రాత్రి సుమారు 20కు పైగా మర పడవలు కచ్చ దీవుల సమీపంలో చేపల వేటలో నిమగ్నమయ్యాయి. సోమవారం వేకువజామున భారత సరిహద్దులో వేటలో ఉన్నప్పటికీ, మర పడవలను సైతం శ్రీలంక సేనలు వదిలి పెట్టలేదు. వచ్చీ రాగానే దాడులకు దిగారుు. మర పడవలను వేగంగా ఒడ్డుకు నడపడం కష్టతరం. దీంతో కొన్ని పడవలు తప్పించుకోగా, మూడు పడవలు మాత్రం లంక సేనల చేతికి చిక్కాయి. ఒక్కో పడవలో ఆరుగురు ఉండగా, వారందర్నీ తమ దేశానికి బందీగా పట్టుకెళ్లారు. వీరిలో మైఖేల్, ముసిన్, ప్రిన్స్, శేషు తదితరులు ఉన్నారు. సమాచారం అందుకున్న వారి కుటుంబాలు విచారవదనంలో మునిగాయి. రామేశ్వరంలోని జాలర్ల సంఘాల ప్రతినిధులు అగ్గిమీదబుగ్గిలా మండిపడుతున్నారు. కేంద్రం తమకు హామీ ఇచ్చినట్టు ఇచ్చి విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస దాడులు జరుగుతుండటంతో, తమ సత్తా ఏమిటో కేంద్రానికి చూపించడం లక్ష్యంగా భారీ ఆందోళనలకు సిద్ధం అవుతోన్నారు. ఇందు కోసం సముద్ర తీర గ్రామాల్లోని జాలర్ల సంఘాలు ఏకం అవుతున్నాయి. బందీ సమాచారంతో రామేశ్వరం తీరంలోని పలు గ్రామాల జాలర్లు ఉదయం చేపల వేటను బహిష్కరించారు.
కరుణ ఆగ్రహం: కేంద్రం తీరుపై డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస బెట్టి శ్రీలంక సేనల వీరంగానికి తమిళ జాలర్లు బలి పశువులవుతుంటే, చోద్యం చూడటం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. తమ పార్టీ ఎంపీల నేతృత్వంలో జాలర్ల సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి వచ్చేలోపు కొందరు బందీగా శ్రీలంక సేనలు పట్టుకెళ్లడం బట్టి చూస్తే, ఓ వైపు జాలర్లకు హామీలు ఇచ్చినట్టు ఇచ్చి, మరో వైపు శ్రీలంక సేనల్ని ఉసిగొల్పుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం లేఖాస్త్రాలతో కాలం నెట్టుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. స్పష్టమైన నిర్ణయంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కంటి తుడుపు చర్యల్ని మానుకుని, ఈ దాడులకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించేందుకు ముందుకు రావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరారు.