బాల్యం బలహీనం!
చిన్నారుల్లో పౌష్టికాహారలోపం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో పావువంతు పిల్లలు బలహీనంగా ఉన్నారు. శిశు సంక్షేమ శాఖ గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆ శాఖ వెలువరించిన తాజా లెక్కల ప్రకారం.. జిల్లాలో 21.4 శాతం పిల్లలు జనన సమయంలోనే తక్కువ బరువుతో పుడుతున్నారు. ఈ కారణంగా తరచూ వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పౌష్టికాహారం లోపించడం వారి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
* మూడేళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహారలోపం
* సాధారణం కంటే తక్కువ బరువున్న పిల్లలు 21.4%
* తరచూ అనారోగ్యాల బారిన పడుతున్న వైనం
* ఆరోగ్యలక్ష్మి ఫలితాలు అంతంతమాత్రమే..
* శిశు సంక్షేమ శాఖ తాజా గణాంకాలు విడుదల
సాక్షి, రంగారెడ్డి జిల్లా : మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వివరాల ప్రకారం జిల్లాలో 2,36,424 మంది మూడేళ్లలోపు చిన్నారులున్నారు.
ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న ఈ చిన్నారుల్లో 1,82,711 మంది పిల్లలు మాత్రమే సాధారణ బరువు కలిగి ఉన్నారు. 50,696 మంది చిన్నారులు సాధారణ బరువు కంటే తక్కువగా ఉన్నట్లు ఆ శాఖ సర్వేలో తేలింది. గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇలా తక్కువ బరువున్న పిల్లలు పుడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మరో 2,017 మంది పిల్లలు అత్యంత తక్కువ బరువుతో జన్మించారు. మొత్తం చిన్నారుల్లో 1.2 శాతం పిల్లలు అతి తక్కువ బరువుతో ఉండడం ఆందోళన కలిగించే విషయమే.
ఫలించని ఆరోగ్యలక్ష్మి
గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, ఆకుకూరలు, పప్పుతో కూడిన ఒక పూట భోజనం, ఐరన్ మాత్రలు అందిస్తారు. పుట్టే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం కింద 37,658 మంది గర్భిణులకు పౌషికాహారాన్ని అందిస్తున్నట్లు ఐసీడీఎస్ గణాంకాలు చెబుతున్నాయి. పిల్లల ఆరోగ్య పరిస్థితిని చూస్తుంటే ఈ పథకం ఫలితాలు ఆశించినట్లుగా కనిపించడం లేదు. పావువంతు పిల్లలు తక్కువ బరువుతో అనారోగ్యం పాలవుతుండడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది.