మహిళ దారుణ హత్య?
రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం
ప్రియుడే హత్య చేశాడని బంధువుల ఆరోపణ
కారేపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన చీమలపాడు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. రేలకాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఈర్యతండాకు చెందిన విజయ అలియాస్ అరుణ(25)ను రేలకాయలపల్లి గ్రామానికి చెందిన బానోతు రవీందర్‌కు ఇచ్చి 2011లో పెళ్లి చేశారు. వీరి దాంపత్య జీవితంలో కూతురు జన్మించింది. ఈ క్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో రెండేళ్ల క్రితం రవీందర్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన అవివాహితుడు రమేష్‌తో విజయ సహజీవనం చేస్తుండటంతో.. ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాము పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో ఇరువురి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని గురువారం గ్రామానికి చేరుకున్నారు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు వారితో గొడవకు దిగి.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. రమేష్, విజయ సమీపంలోని చీమలపాడు రైల్వే స్టేషన్‌కు గురువారం రాత్రి చేరుకున్నారు.
తర్వాత ఏం జరిగిందంటే..
శుక్రవారం తెల్లవారుజామున చీమలపాడు రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన విజయ తీవ్ర గాయాలతో మృతిచెంది ఉంది. రమేష్ స్వల్ప గాయాలతో 15 కిలో మీటర్ల దూరం రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ కారేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తెల్లవారుజామున 4 గంటలకు చేరుకున్నాడు. తాను, విజయ ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని రైల్లో నుంచి దూకామని, తాను చెట్లలో చిక్కుకున్నానని, విజయ రాళ్లపై పడి మృతి చెందిందని పోలీసులకు వివరించాడు. కాగా, గాయపడిన రమేష్‌ను 108 వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
బంధువుల ఆరోపణ
కాగా.. రమేష్ కుటుంబ సభ్యులు విజయపై గొడ్డళ్లతో దాడి చేసి.. దారుణంగా హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలోనే రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయని, తర్వాత పథకం ప్రకారం విజయ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రమేష్ సైతం కుట్ర పన్నాడని ఆరోపించారు. విజయ శరీర భాగాలపై గాయాలు, రైల్వే ట్రాక్‌పై ఆనవాళ్లు, మృతి చెందిన తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న కొత్తగూడెం రైల్వే ఎస్సై వడిచర్ల గోవర్ధన్, రైల్వే హెడ్ కానిస్టేబుల్ చెన్నారావు, కారేపల్లి ఏఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.