పబ్లిక్‌గా ఇంట్లోంచి వివాహితను లాక్కెళ్లి..
గురుగ్రామ్: దేశరాజధాని ఢిల్లీకి సమీపంలో హరియాణాలోని గురుగ్రామ్ ప్రాంతంలో ఘోర సంఘటన జరిగింది. బద్షాపూర్ అనే గ్రామంలో అందరూ చూస్తుండగానే ముగ్గురు దుండగులు ఓ వివాహిత (29) బలవంతంగా ఇంట్లోనుంచి లాక్కొచ్చి, బైకుపై తీసుకెళ్లారు. ఇరుగుపొరుగు వారు కనీసం అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. ఆ సమయంలో బాధితురాలు ఒక్కతే ఇంట్లో ఉంది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆమె తండ్రి ఉద్యోగానికి వెళ్లగా, తల్లి ఆస్పత్రికి వెళ్లింది. దుండుగులు ఆమెను బైకుపై కొండప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు.
ఆ మరుసటి రోజు బాధితురాలు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులకు విషయం చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిందితులు ముగ్గురూ పరారీలో ఉన్నారు. నెలరోజుల క్రితం నిందితులు ఆమెను వేధించడంతో పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. గ్రామపెద్దల జోక్యం ముగ్గురూ బాధితురాలికి క్షమాపణలు చెప్పారు. ఆమె ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టినా, నిందితులు ప్రతీకారంతో ఆమె జీవితాన్ని నాశనం చేశారు.