కట్నం వేధింపులతో మహిళ మృతి
కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
బచ్చన్నపేట : అదనపు కట్నం కోసం వివాహితపై భర్త, బావ, ఆడపడుచూ, అత్త కలిసి ఈనెల 10న ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిన ఘటన బచ్చన్నపేటలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన గట్టు సిద్దయ్య మూడో కూతురు స్నేహ(సంధ్య)(25)కు బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన బుస్స నాగరాజుతో 2008లో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో అన్ని కట్నకానుకలను ఇచ్చారు. ఆ తర్వాత ఏడాది నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంట్లో వెట్టి చాకిరీ చేయించడంతో పాటు ఆమె పుట్టింటి వారు ఎవరైనా వచ్చినప్పుడు సంధ్యను గదిలో ఉంచి తాళం వేసి బంధువులను కలవనిచ్చేవారు కాదు. ఈ విషయమై పలు మార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని మృతురాలి తల్లిదండ్రులు చెప్పారు.ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి కాయిన్ బాక్స్‌తో తమకు ఫోన్ చేసేదని తెలిపారు. ఈ నెల 10న భర్త నాగరాజు, బావ శ్రీనివాస్, ఆడపడుచు పుష్ప, అత్త రాజమణి, తోటి కోడలు శ్రీదేవి కలసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి బాత్రూంలో వేసి డోర్ వేశారనీ, సంధ్య అరుపులు విని ఇరుగు పొరుగు వారు రాగానే ‘అయ్యో.మా కోడలు ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ’ డ్రామా ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద్రాబాధ్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందిందని చెప్పారు. తమ కూతురు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సంధ్యకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్‌కుమార్ మాట్లాడుతూ మృతురాలి భర్త నాగరాజు, బావ శ్రీనివాస్, అత్త రాజమణి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారని, అంత్యక్రియలు పూర్తయ్యేవరకు జామీనుపై పంపించామని తెలిపారు.