శివసేన నాయకురాలి దారుణ హత్య
ఉత్తరప్రదేశ్‌లో శివసేన మహిళా నాయకురాలు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఆమె భర్తకు కత్తిపోట్లతో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె ఇంట్లోనే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరతి బోర్కర్, ఆమె భర్త అనిల్ ఇద్దరిపై ముగ్గురు దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. గతంలో శివసేనకు సెంట్రల్ నాగ్‌పూర్ శాఖా ప్రముఖ్‌గా వ్యవహరించిన ఆరతి తన భర్తను కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కువ కత్తిపోట్లకు గురయ్యారు. బహుశా అనిల్ బోర్కరే దుండగుల ప్రధాన లక్ష్యం అయి ఉంటారని భావిస్తున్నారు.
దుండగులలో ఒకరైన ఆకాశ్ గౌర్ఖండే అనే వ్యక్తిని అక్కడ స్థానికులు పట్టుకుని, అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. గతంలో పొరుగువారితో ఉన్న వివాదమే ఈ హత్యకు దారి తీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసర్వానీ కుటుంబానికి చెందిన నరేంద్ర, సురేంద్ర, సోను అనే ముగ్గురితో పాటు రవి ఖాంతే అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని, వారిపై హత్య, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపామని పోలీసులు తెలిపారు.