కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో కదులుతున్న కారులో ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన.. గతంలో జరిగిన పార్క్ స్ట్రీట్ సంఘటనను మళ్లీ గుర్తుకు తెస్తోంది. బాధితురాలిపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేసిన ఐదుగురు దుండగులు.. తర్వాత ఆమెను రోడ్డుపక్కన విసిరిపారేశారు. కొన్నేళ్ల క్రితమే భర్త వదిలేసిన బాధితురాలు.. రాజ్ అనే స్నేహితుడితో కలిసి కోల్కతా పర్యటనకు వచ్చింది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రాజ్ ఓ కారు అద్దెకు తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. అయితే కారులో మరో నలుగురు ఉండటంతో ఆమె ఎక్కేందుకు నిరాకరించింది. కానీ, పర్వాలేదని చెప్పి రాజ్ ఆమెను తీసుకెళ్లాడు. కొంతదూరం వెళ్లాక ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. ఆమెకు తిరిగి తెలివి వచ్చేసరికి కారు డ్రైవర్ షేక్ రెజౌల్ అలియాస్ ఛోటు ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. అయితే అప్పటికే బాగా నీరసంగా ఉండటంతో కనీసం అతడిని ఆపడం గానీ, అరవడం గానీ చేయలేకపోయింది.
ఆ తర్వాత ఛోటు ఆమెను ఆర్కా స్టేషన్ రోడ్డుకు తీసుకెళ్లి ఆమె ఇంటికి అర కిలోమీటరు దూరంలో నిర్మానుష్యంగా ఉన్నచోట రోడ్డుపై వదిలేశాడు. అలాగే అక్కడ ఐదు నిమిషాల పాటు పడి ఉంది. అప్పటికే ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్నవారు ఆమెను చూసి వెంటనే ఇంటికి తరలించారు. ఇంటికి వచ్చేసరికి ఆమె దుస్తులు చిరిగిపోయి ఉన్నాయని, సగం స్పృహలోనే ఉందని ఆమె వదిన తెలిపింది.
అయితే.. ఈ కేసులో పోలీసుల తీరు మరింత దారుణంగా ఉంది. బాధితురాలి తల్లి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లగా, తొలుత ఈఎస్ఐ ఆస్పత్రికి వెళ్లాలన్నారు. వాళ్లతో కనీసం ఒక లేడీ కానిస్టేబుల్ను కూడా పంపలేదు. ఈఎస్ఐ నుంచి విద్యాసాగర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధరించారు. ప్రధాన నిందితుడు మినహా మిగిలిన నలుగురినీ పోలీసులు తర్వాత తీరిగ్గా అరెస్టు చేశారు. అప్పటివరకు నిందితులంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆ ప్రాంతానికి చెందినవాళ్లు చెప్పారు.