కూతురికి గుండు చేసి.. ముఖానికి నల్లరంగు పూసి..
అప్పటికే పెళ్లయిన తమ కూతురు ఎవరితోనో లేచిపోయిందని.. ఆమెకు గుండు గీయించి ముఖానికి నల్లరంగు పూసి.. గ్రామ వీధుల్లో ఊరేగించారు ఆమె తల్లిదండ్రులు. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘోరం జరిగింది. వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న యువతి.. వారం రోజుల తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. దాంతో ఆమె తండ్రి, భర్త, సవతి తల్లి కలిసి ఆమెను చిత్రహింసలు పెట్టి, తర్వాత పంచాయతీ వద్ద హాజరుపరిచారు. కుటుంబానికి పరువునష్టం కలిగించినందుకు ఆమెకు ఈ శిక్ష విధించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు.
దాంతో ఆమె తల్లిదండ్రులు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో యువతి కుటుంబానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎహసాన్ సాదిక్ తెలిపారు. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్యల లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారని ఇద్దరు గర్భిణులను గత వారం దారుణంగా హతమార్చారు.