రేప్ చేశాడని ఆమె చెబుతుంటే.. డౌట్‌గా ఉంది
ముంబై: ఓ మహిళ (23) పెట్టిన అత్యాచార కేసుపై బాంబే హైకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. సదరు మహిళ చేసిన ఆరోపణలు నమ్మశక్యంగా లేవని పేర్కొంది. ఈ కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసింది. 15 వేల రూపాయల పూచీకత్తుపై నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. 2014 జూన్ 11న శిరోండాలోని సోదరి ఇంటికి వెళ్తుండగా, సమీర్ జాదవ్ అనే వ్యక్తి బలవంతంగా తనను కారులోకి లాక్కొన్నాడని ఆ మహిళ ఆరోపించింది. ఓ హోటల్‌కు తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. మరుసటి ఏడాది అనగా 2015 మేలో ఆమె ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన సెషన్స్ కోర్టు జాదవ్‌ను దోషిగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది. నిందితుడు కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. 'నేరం జరిగిన తర్వాత 11 నెలల వరకు బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఆమె చేసిన ఆరోపణలు, సాక్ష్యాలపై సందేహం కలుగుతోంది. ఓ వ్యక్తి 23 ఏళ్ల మహిళను బలవంతంగా కారులోకి లాక్కొని చేతి రుమాలుతో ఆమె నోరు కట్టేశాడని ఫిర్యాదులో ఉంది. కానీ ఆమె చేతులు కట్టేయలేదు. నిందితుడు ఆమె చేతులు కట్టేయకుండా కారులో ఎలా తీసుకెళ్లగలడు? హోటల్‌కు తీసుకెళ్తుంటే బాధితురాలు అతన్ని ఎందుకు అడ్డుకోలేదు? బాధితురాలు చెబుతున్న మాటలను బట్టి ఆమె నిందితుడిని అడ్డుకున్నట్టు కనిపించడం లేదు' అని జస్టిస్ అనంత్ బాదర్ పేర్కొన్నారు. జాదవ్ న్యాయవాది మాట్లాడుతూ.. సదరు మహిళకు, అతనికి మధ్య శారీరక సంబంధముందన్న విషయాన్ని వ్యతిరేకించడం లేదని, అయితే అతను ఆమెను అత్యాచారం చేయలేదని చెప్పారు. బాధితురాలు నమ్మశక్యం కాని కట్టుకథ చెబుతోందని వాదించారు.