గంజాయి తరలిస్తున్న మహిళల అరెస్టు
నర్సీపట్నం: టిప్పర్లో తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ మొబైల్ పార్టీ గురువారం స్వాధీనం చేసుకుంది. చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్న టిప్పర్ను డిగ్రీ కళాశాల వద్ద ఆపి, తనిఖీ చేయగా 16 దుస్తుల మూటల్లో 250 కిలోల గంజాయిని గుర్తించినట్టు సమాచారం. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. టిప్పర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేసినట్టు తెలిసింది. వీరందరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. మన్యంలోని పాత దుస్తుల సేకరణ ముసుగులో గంజాయి తరిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. పట్టుబడిన టిప్పర్ నర్సీపట్నానికి చెందినది. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ డివి.రాజును సంప్రదించగా మొబైల్ పార్టీ పట్టుకుందని, పూర్తి వివరాలు తెలియవలసి ఉందన్నారు.
40 కిలోల గంజాయి స్వాధీనం
యలమంచిలి: రెండు ఆటోల్లో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గుర్ని యలమంచిలి ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలను శుక్రవారం తెలియజేస్తామని ఎక్సైజ్ సీఐ జయరామిరెడ్డి తెలిపారు.